సరిహద్దుల్లో శాంతి స్థాపన లక్ష్యంగా భారత్-పాక్ తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ స్వాగతించారు. ఇరు దేశాల సైన్యాల డైరెక్టర్ జనరళ్ల చర్చల అనంతరం.. గురువారం అర్ధరాత్రి నుంచి కాల్పుల విరమణ ఒప్పందానికి తప్పకుండా కట్టుబడి ఉండాలన్న భారత్-పాక్ నిర్ణయంపై ఇమ్రాన్ ఖాన్ మొదటిసారి స్పందించారు. రెండేళ్ల క్రితం పాకిస్థాన్ బాలాకోట్ ఉగ్ర శిబిరాలపై భారత వైమానిక దాడిని గుర్తు చేస్తూ ట్వీట్ చేసిన ఆయన.. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకునేందుకు సిద్ధమని వివరించారు.
"నియంత్రణ రేఖ వెంబడి శాంతి నెలకొల్పే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. ఐరాస భద్రతామండలి తీర్మానాల ప్రకారం కశ్మీర్ ప్రజల దీర్ఘకాల డిమాండ్ స్వయం నిర్ణయాధికార కల్పనకు భారత్ అవసరమైన చర్యలు తీసుకోవాలి."
-ఇమ్రాన్ ఖాన్, పాక్ ప్రధాని.
'అప్రమత్తంగానే ఉంటాం'
నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని తూ.చ. తప్పకుండా పాటించాలన్న భారత్, పాకిస్థాన్ నిర్ణయం జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద నిరోధక చర్యలపై ఎలాంటి ప్రభావం చూపదని ఆర్మీ ఉత్తర కమాండర్ లెఫ్టినెంట్‌జనరల్ వైకే జోషి అన్నారు. జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో భారత సైన్యం పూర్తి అప్రమత్తతతో ఉంటుందని వ్యాఖ్యానించారు. ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులకు ఇచ్చే పురస్కార ప్రదానోత్సవంలో పాల్గొన్న ఆయన పలువురికి పతకాలు అందించారు.
సరిహద్దుల్లో శాంతిస్థాపనకు భారత్ ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్న జోషీ.. దేశరక్షణ విషయంలో ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.