చైనా దంపతులు ఇక నుంచి ముగ్గురు పిల్లలను కనొచ్చు. ఇందుకు సంబంధించిన నూతన విధానానికి చైనా జాతీయ చట్టసభ ఆమోదం తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత జనాభా గల ఈ దేశంలో జననాల రేటు ఆందోళనకర స్థాయిలో పడిపోయిన నేపథ్యంలో ఈ ఏడాది మేలో ముగ్గురు పిల్లల విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఇద్దరు పిల్లలనే కనాలనే నింబధనను ఎత్తివేస్తూ జనాభా, కుటుంబ నియంత్రణ చట్టానికి సవరణ చేసింది.
భారం ప్రభుత్వానిదే..
ముగ్గురు పిల్లల్ని కనే తల్లిదండ్రులపై భారం పడకుండా వారికి ఆర్థికంగా సామాజికంగా మద్ధతుగా నిలిచేలా చట్టంలో మార్పులు చేశారు. ఆర్థిక సహకారం, పన్ను రాయితీ, విద్య, ఉద్యోగం, సొంతిల్లు వంటి విషయాల్లో ప్రభుత్వం తల్లిదండ్రులకు సాయం చేయనున్నట్లు చైనా డైలీ తెలిపింది.
సామాజిక-ఆర్థిక అభివృద్ధి, జనాభా వృద్ధిలో దీర్ఘకాల సమతుల్యం ఉండేందుకు చైనా కమ్యూనిస్టు పార్టీ ముగ్గురు పిల్లల విధానాన్ని తీసుకొచ్చింది. 2016 వరకు 'ఒక్కరు ముద్దు అసలే వద్దు' అనే నినాదంతో దంపతులు కేవలం ఒక్కరిని కనేందుకే చైనా ప్రభుత్వం అనుమతించింది. ఆ తర్వాత 2016లో ఇద్దరు పిల్లలను కనవచ్చని ప్రకటించింది. దేశంలో యువత కంటే వృద్ధుల సంఖ్యే ఎక్కువగా వృద్ధి చెందుతుందనే నివేదికను గమనించి మేలుకుంది. అందుకే మేలో ముగ్గురు పిల్లల విధానాన్ని ప్రకటించింది.
ఒక్కరే ముద్దు విధానం కారణంగా చైనాలో 30 ఏళ్లలో 40 కోట్ల జననాలను నియంత్రించినట్లు అధికారులు తెలిపారు. దేశ జనాభా వృద్ధి అత్యంత తక్కువగా ఉందని జనగణన నివేదికలో తెలుసుకున్నాక నూతన విధానాన్ని తీసుకొచ్చారు.
చైనా గతేడాది వెలువరించిన జనగణన నివేదిక ప్రకారం దేశంలో వృద్ధుల సంఖ్య 26.4 కోట్లు (18.7 శాతం) పెరిగింది.
ఇదీ చూడండి: దక్షిణాసియాపై 'డ్రాగన్' వల- భారత్ లక్ష్యంగా కొత్త కూటమి