పాకిస్థాన్లో ఓ అల్లరి మూక హిందూ దేవాలయాన్ని పూర్తిగా కూల్చివేసింది. ఈ ఘటన ఖైబర్ పఖ్తున్ఖ్వా రాష్ట్రంలోని కరాక్ జిల్లాలో జరిగింది.
సుమారు వెయ్యి మందికి పైగా స్థానికులు మందిరం తొలగించాలని నిరసనలు చేపట్టినట్లు ప్రత్యక్ష్య సాక్షులు తెలిపారు. ముందుగా దేవాలయం బయట పెద్ద ఎత్తున నినాదాలు చేసిన వారు.. చివరకు దాడికి ప్రయత్నించారని పేర్కొన్నారు.
భిన్న వాదనలు
ఈ చారిత్రక కట్టడాన్ని 1920కి ముందు నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ మందిరాన్ని కూల్చివేసే సమయంలో నిర్మాణంలో ఉన్న మరో భవంతిని కూడా పడగొట్టినట్లు బాధితులు తెలిపారు. ఈ ఆందోళనలను పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని ఆరోపించారు. అయితే దీనిపై పోలీసుల వివరణ మరోలా ఉంది. దేవాలయ నిర్వాహకులు రహస్యంగా మందిర విస్తరణ పనులు చేపట్టారని, అందుకే స్థానికులు ఆందోళనకు దిగారని చెప్పారు.
"స్థానికంగా ఉండే మందిరం తొలగించాలని ఆందోళనకారులు మొదటగా నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చారు. శాంతియుతంగా జరుగుతుందని భావించాం. కానీ కొందరు నిరసనకారులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో దాడి జరిగింది. దీనిపై కేసు నమోదు చేశాం. దర్యాప్తు చేస్తున్నాం."
- పోలీసులు