ఏదో పనిమీద బయటకు వెళ్లి తిరిగొస్తాం. తీరా ఇంటికొచ్చాక చూస్తే తాళంచెవి కనిపించదు. హడావుడిగా ఏటీఎం వద్దకు వెళతాం. కానీ, అక్కడకు వెళ్లాక చూస్తే జేబులో కార్డులు ఉండవు. ఇలాంటి అనుభవాలు.. అందరి జీవితాల్లో ఎప్పుడో ఒకసారి ఎదురవుతూనే ఉంటాయి. అయితే.. ఈ సమస్యలేవీ లేకుండా మన చెయ్యే.. తాళం చెవిగా, ఏటీఎం కార్డుగా, ఆఫీసులో ఐడీకార్డులాగా పని చేస్తే ఎంతో బాగుంటుంది కదా? రష్యాలోని వోల్చెక్ అనే ఓ వైద్యుడికి ఇదే ఆలోచన వచ్చింది. ఇంకేం.. టెక్నాలజీని 'చేతి'లో పెట్టుకుని తన పనులను సులభతరం చేసుకుంటున్నారు.
అంతా వాటి మహిమే..
వోల్చెక్... నోవోసిబ్రిస్క్ నగరంలోని ఓ ఆస్పత్రిలో ప్రసూతి వైద్యుడు. ఆయన తన ఆస్పత్రిలో తలుపులు తెరవాలంటే.. తన చేతిని ఓ రీడర్ వద్ద చూపిస్తే చాలు. అంతే.. టక్కున తలుపులు తెరుచుకుంటాయి. అసలు ఇదెలా సాధ్యమని ఆశ్చర్యపడుతున్నారా? అంతా చిప్‌లు చేసిన మాయే! తన శరీరంలో అమర్చిన చిప్లే ఎలక్ట్రానిక్ తాళం చెవులుగా పని చేస్తాయి. ఎక్కడో నోవోసిబ్రిస్క్ నగరంలోని ఓ చిన్న ఆస్పత్రిలో పని చేసే వోల్చెక్ ఈ అధునాతన సాంకేతికత వినియోగంతో.. ఇప్పుడు రష్యావ్యాప్తంగా ఫేమస్ అయ్యారు.
చాలా ఈజీ...
ఫెర్రైట్ ఖనిజంతో తయారు చేసిన ఈ చిన్న చిప్‌లను చిన్నపాటి గ్లాస్ ట్యూబుల్లో ఉంచి శరీరంలో అమర్చుతారు. చర్మం కింద వీటిని మందపాటి సూది ఉన్న ఓ పెద్ద సిరంజీ సాయంతో ప్రవేశపెడతారు. వీటిని మనకు కావాల్సినప్పుడు సులభంగా తొలగించుకోవచ్చు కూడా. కేవలం తలుపులు తెరిచేందుకే కాకుండా ఏటీఎం కార్డులు, ఆఫీస్‌లో ఐడీ కార్డు లాగా కూడా వీటిని వాడుతున్నారు వోల్చెక్. ఈ చిప్ సాయంతో తన పనులన్నీ ఎంతో సులువుగా పూర్తవుతున్నాయని ఆయన అంటున్నారు.
2014లో వోల్చెక్ తన శరీరంలో మొదటి చిప్‌ను అమర్చుకున్నారు. ఆయన శరీరంలో ప్రస్తుతం 5 చిప్‌లు ఉన్నాయి. అంతకుముందు ఆరు చిప్‌లు ఉండేవి. కానీ, ఒక చిప్ ఎక్స్పైర్ అవ్వగా.. దాన్ని ఆయన తొలగించుకున్నారు.
"నా చేతిలో ప్రస్తుతం 5 చిప్‌లు ఉన్నాయి. ఇక్కడ మూడు, కుడి చేతి మధ్య వేలిలో ఒకటి. మరొకటి ఇక్కడ. మధ్య వేలుకు ఉన్న ఈ చిప్‌ను వర్క్పాస్లా ఉపయోగిస్తాను. వీటిని ఉపయోగించడం చాలా తేలిక. బిజినెస్ కార్డులకు సంబంధించిన సమాచారానికి సంబంధించిన కీ ఎడమ చేతి మణికట్టులో ఉంది. రవాణాకు సంబంధించిన చిప్ నా కుడి చేతి మణికట్టు వద్ద ఉంది."
-వోల్చెక్, వైద్యుడు
ఆ ఛాన్సే లేదు..
కార్డులను వెంట తీసుకువెళితే అవి ఎక్కడైనా పోయే ప్రమాదం ఉంది. కానీ, ఈ చిప్‌లు వాడితే అలాంటి సమస్య ఏమీ లేదని అంటున్నారు వోల్చెక్.
"మీరు ఏదైనా పనిమీద బయటకు వెళ్లినప్పుడల్లా పర్సు వెంట తీసుకువెళ్లాలి. అందులో నుంచి కార్డు బయటకు తీయాలి. దాన్ని వాడాలి. మళ్లీ దాన్ని యథాస్థానంలో పెట్టాలి. అదంతా పెద్ద వ్యవహారం. నా భార్య కూడా తాను వాడే నాలుగు కార్డులు పోగొట్టుకున్న తర్వాత ఇలాంటి ఓ చిప్‌ను తన శరీరంలో అమర్చుకుంది. వీటితో పనలు ఎంతో సులువుగా మారిపోతున్నాయి."
-వోల్చెక్, వైద్యుడు
స్వయంగా వైద్యుడైన వోల్చెక్.. ఒంట్లో షుగర్ లెవెల్స్ కొలిచేందుకు వినియోగించే గ్లూకో మీటర్ వంటి వైద్య పరికరాలను కూడా ఈ చిప్‌ల రూపంలో తీసుకువస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు.
ఆయన కూడా..
ఇలా శరీరంలో చిప్‌లను అమర్చుకున్నది వోల్చెక్ ఒక్కరే కాదు. రష్యాలోని ఐటీ నిపుణుడు, ఇంజినీర్ రేడియోలజిస్ట్ సెర్జీ డోర్జ్డోవ్ కూడా తన శరీరంలో చిప్‌లను పెట్టుకున్నారు. ఎంఆర్ఐ, ఎక్స్-రే, సీటీ స్కాన్ తీసుకునే సమయాల్లో ఈ చిప్‌లు ఎలాంటి అడ్డంకి కాదని వారిద్దరూ చెబుతున్నారు.
ఇవీ చూడండి: