అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల ఏరివేత కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో.. 385 మంది తాలిబన్లను సైన్యం మట్టుబెట్టింది. మరో 210 మంది గాయపరిచింది. ఈ మేరకు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఫవాద్ అమన్.. ట్విట్టర్ వేదికగా తెలిపారు.
"నంగ్రాహార్, లోగర్, గజ్నీ, పక్తికా, మెయిడెన్ వార్డాక్, కందహార్, హేరాత్, ఫరా, జోవ్జాన్, సమంగన్, హెల్మాండ్, తాఖర్, భగ్లాన్, కాపిసా రాష్ట్రాల్లో సైన్యం చేపట్టిన గాలింపుల్లో 385 మంది తాలిబన్లను గడచిన 24 గంటల్లో సైన్యం మట్టుబెట్టింది. మరో 210 మందిని గాయపరిచింది. ఫైజ్-అబద్ నగరం, బాదాఖాసాన్, తాలిఖన్, తక్హార్ నగరాలపై తాలిబన్లు జరిపిన దాడులను సైన్యం తిప్పికొట్టింది.
-ఫవాద్ అమన్, అఫ్గాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి
కుందుజ్‌లోని తాలిబన్ల స్థావరాల్లోనూ అఫ్గాన్ సైన్యం దాడులు జరిపిందని అఫ్గాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. వైమానిక దాడుల్లో ఎక్కువ మంది మరణించారని చెప్పింది. అఫ్గాన్ నుంచి అమెరికా, నాటో బలగాల ఉపసంహరణ నేపథ్యంలో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. దేశంలోని కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రభుత్వ, పోలీసు, ఆర్మీ అధికారుల బంధువులను అపహరించి హతమార్చుతున్నారు తాలిబన్లు.
2021 తొలి అర్ధభాగంలో 1,659 మంది పౌరులు మరణించారు. 3,254 మంది గాయపడ్డారు. అఫ్గాన్ అధికారులపై దాడులు కొనసాగిస్తామని గత బుధవారం ప్రకటించాడు తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్. రక్షణ శాఖ తాత్కాలిక మంత్రి బిస్మిల్లా మొహమ్మది ఇంటిపై కారు బాంబు దాడి తర్వాత ఈ ప్రకటన చేశాడు.
ఇవీ చూడండి: