చైనాలో నిర్వహించిన మౌంటెన్ మారథాన్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన ఈ రేస్.. కాసేపటికే చేదు అనుభవాలు మిగిల్చింది. ప్రతికూల వాతావరణం ప్రభావంతో మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోయారని స్థానిక జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. మరో ఎనిమిది మంది స్పల్ప గాయాలతో బయటపడ్డారని పేర్కొంది.
రేస్ మొదలైన కాసేపటికే..
వాయువ్య గాన్సూ రాష్ట్రం- బాయిన్ నగరంలోని ఎల్లో రివర్ స్టోన్ ఫారెస్ట్‌లో మొత్తం 172 మందితో 100 కిలోమీటర్ల క్రాస్ కంట్రీ మౌంటెన్ మారథాన్ శనివారం మధ్యాహ్నం ప్రారంభమైంది. రేసర్లంతా ఎంతో ఉత్సాహంగా తమ పరుగును మొదలుపెట్టారు. సుమారు 20 నుంచి 31 కిలోమీటర్ల దూరం వెళ్లాక.. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. భీకరమైన చలిగాలులతో పాటు వడగళ్లు, మంచు వర్షం కురిసింది. రేసర్ల శరీర ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో కొందరు తీవ్ర అస్వస్థతకు గురై అక్కడిక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. మరి కొందరి ఆచూకీ గల్లంతైంది. తప్పిపోయిన వారు సహాయం కోసం అధికారుల్ని సంప్రదించినట్టు సమాచారం.
ఇదీ చదవండి: విమాన ప్రమాదంలో నైజీరియా సైన్యాధిపతి మృతి
సహాయక చర్యలకు ఆటంకం..
అప్రమత్తమైన నిర్వహకులు.. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితులు రక్షణ చర్యలకు తీవ్ర ఆటంకం కలిగించాయి. అయినప్పటికీ ప్రత్యేక చర్యలు చేపట్టిన సిబ్బంది.. రాత్రి సమయంలోనూ టార్చ్లైట్ల సాయంతో గల్లంతైన వారికోసం గాలించారు. కొండ ప్రాంతాల్లోని ప్రతికూల పరిస్థితుల్లోనే ఆదివారం వరకూ సహాయక చర్యలు కొనసాగగా.. ఉదయం 9:30 గంటలకు చివరి మృతదేహం లభ్యమైంది. మొత్తం 172 మంది రేసులో పాల్గొనగా.. 21 మంది రేసర్లు ట్రాక్‌పైనే తమ జీవితాన్ని ముగించారు. మరో 143 మంది సురక్షితంగా బయటపడ్డారు. మరో ఎనిమిది మందికి స్వల్ప గాయాలయ్యాయి.
తీవ్ర విషాదం మిగిల్చిన ఈ దుర్ఘటన కారణంగా.. మారథాన్ పోటీలను అర్ధంతరంగా నిలిపివేశారు నిర్వహకులు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు స్థానిక అధికారులు తెలిపారు.
గతంలోనూ..
చైనాలో అత్యంత పేద రాష్ట్రాలలో గాన్సూ రాష్ట్రం ఒకటి. ఇది ఉత్తర మంగోలియా, పశ్చిమాన జిన్జియాంగ్లతో సరిహద్దులను కలిగి ఉంటుంది. తరచూ ఇలాంటి ఘటనలతో ఆ ప్రాంతం ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారింది. గతంలో వరదల బీభత్సం, కొండచరియలు విరిగిపడిన ఘటనలు ఇక్కడ చోటుచేసుకున్నాయి. వరదల కారణంగా.. 2010లో ఒకే పట్ణణంలో సుమారు వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అక్కడ భూకంపాలు సైతం తరచుగా సంభవిస్తుంటాయని తెలుస్తోంది.
ఇదీ చదవండి: టీకా వేసుకుంటే బీరు ఉచితం!