వాయవ్య పాకిస్థాన్‌లో భారీ ఉగ్రదాడి జరిగింది. చైనా ఇంజినీర్లు, కార్మికులు, పాక్ భద్రత సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సు లక్ష్యంగా భారీ ఐఈడీ పేలుడు సంభవించింది. కోహిస్థాన్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో 9 మంది చైనీయులు సహా మొత్తం 13 మంది మరణించినట్లు సమాచారం. మృతుల్లో పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు భద్రతా సిబ్బంది కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గాయపడినవారి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణిస్తున్నారు. వారంతా కోహిస్థాన్ జిల్లాలో డాసు డ్యామ్ వద్ద విధులు నిర్వర్తిస్తున్నారు. 'ఒక్క పెట్టున పేలుడు సంభవించడంతో బస్సు.. పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. దాంతో ఒక ఇంజనీర్, ఒక సైనికుడి జాడ గల్లంతైంది. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి' అని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. అయితే ఆ పేలుడు పదార్థాన్ని ముందుగానే బస్సులో అమర్చారా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.