కరోనా వైరస్ కట్టడికి రష్యా తయారుచేసిన స్పుత్నిక్-వి టీకా ప్రయోగాల్లో పాల్గొన్న ప్రతి ఏడుగురు వలంటీర్లలో ఒకరికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నట్టు తెలిసింది. ఈ టీకా ప్రయోగించిన వారిలో 14 శాతం మందిలో ఈ లక్షణాలు కనిపించినట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి మిఖాయిల్ మురాష్కో తెలిపారు. అయితే, ఆ లక్షణాలు మర్నాటి కల్లా సర్దుకున్నాయని ఆయన వివరించారు. స్పుత్నిక్-వి టీకా తీసుకున్న అనంతరం సగటున ఏడుగురిలో ఒకరికి బలహీనత, ఒంటినొప్పులు వంటి లక్షణాలు కనిపించాయని ఆయన వెల్లడించారు.
స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ప్రయోగానికి సంబంధించిన ప్రాథమిక ఫలితాలు ఇటీవల లాన్సెట్ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. దీని ప్రకారం వ్యాక్సిన్ ఇచ్చిన భాగంలో నొప్పి (58% మందికి), విపరీతమైన జ్వరం (50% మందికి), తలనొప్పి (42% మందికి), బలహీనత (28% మందికి), నీరసం (24% మందికి), కండరాలు, కీళ్లనొప్పులు (24% మందికి) వంటి లక్షణాలు కనిపించాయి. తొలి 42 రోజుల్లో కనిపించిన ఈ ప్రభావాలు చిన్నపాటివేనని లాన్సెట్ తెలిపింది. ప్రత్యేకించి వైరస్‌లతో వచ్చే వ్యాధులకు సంబంధించిన ఏ ఇతర వ్యాక్సిన్‌లోనైనా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపింది.
స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌ను ప్రజలు వినియోగించేందుకు రష్యా ఆరోగ్యశాఖ ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని పుతిన్ సర్కార్ భావిస్తోంది. అయితే, రష్యా ఇప్పటికి రెండు దశల క్లినికల్ ట్రయల్స్‌ను మాత్రమే విజయవంతంగా పూర్తి చేసుకుంది. మూడో దశ ప్రయోగాలను భారత్, తదితర దేశాల్లో కూడా చేపట్టాలని భావిస్తోంది. సౌదీ అరేబియా, బ్రెజిల్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలు ఈ టీకా మూడో దశ ప్రయోగాలకు ఇప్పటికే అనుమతించాయి.
తొలి రెండు దశల ప్రయోగాలు విజయవంతం అయినందున భారత నిబంధనలకు అనుగుణంగా దేశంలో మూడోదశ ప్రయోగాలు చేపట్టనున్నట్టు రెడ్డీస్ ఎండీ జీవీ ప్రసాద్ వెల్లడించారు. భారత ప్రభుత్వ అనుమతులు లభించిన అనంతరం 100 మిలియన్ డోసులు డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్‌కు అందించనున్నట్టు రష్యన్ డైరక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇదీ చూడండి:- డా.రెడ్డీస్‌కు 10 కోట్ల రష్యా టీకా డోసులు