సాధారణ ప్రజలకంటే శ్వేతసౌధంలోని ఉన్నతాధికారులకు మొదట కొవిడ్-19 టీకా ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వెలువడిన క్రమంలో.. తన సిబ్బంది టీకా కోసం వేచిచూడాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ‘ప్రత్యేకంగా అవసరమైతే తప్ప.. శ్వేతసౌధంలో పనిచేసే సిబ్బందికి టీకా ఇవ్వడానికి కొంతకాలం పడుతుంది. నేను టీకా తీసుకునేందుకు ఎలాంటి ప్రణాళిక వేసుకోలేదు. అయితే, సరైన సమయంలో దాన్ని తీసుకోవడానికి ఎదురుచూస్తున్నాను' అని ట్రంప్ ట్విటర్ వేదికగా వెల్లడించారు.
ఫైజర్ టీకాకు అమెరికా అనుమతి ఇవ్వడం కారణంగా.. ప్రజలకు టీకా పంపిణీ కార్యక్రమమం షురూ అయింది. సాధారణ ప్రజలకంటే ముందుగా శ్వేతసౌధంలోని ఉన్నతాధికారులకు టీకా ఇస్తారని వార్తలు వెలువడ్డాయి. అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే సిబ్బంది తొలుత దాన్ని తీసుకుంటారని సంబంధిత అధికారులు తెలిపారు. తాజాగా ట్రంప్ మాత్రం తమ సిబ్బందిని వేచి ఉండాలని సూచించారు.
ఇదిలా ఉండగా..తొలివిడత టీకా కార్యక్రమంలో భాగంగా అమెరికా వ్యాప్తంగా 30 లక్షల డోసులను పంపిణీ చేయనున్నారు. వీటిని ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ యూనిట్స్‌లో పనిచేస్తోన్న వైద్య సిబ్బంది, నర్సింగ్ హోమ్‌ల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ఇవ్వనున్నారు. తర్వాత మళ్లీ మూడు వారాలకు వీరందరికి రెండో డోసు అందిస్తారు.