అమెరికా అధ్యక్ష ఎన్నికల అంశం ఓ ముగిసిన కథ. జో బైడెన్‌ను అధ్యక్షుడిగా ఎలక్టోరల్ కాలేజీ కూడా అధికారికంగా ధ్రువీకరించింది. అయినప్పటికీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఓటమిని అంగీకరించడం లేదు. తానే గెలిచానని ఇప్పటికీ వాదిస్తున్నారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ట్రంప్ మద్దతుదారులు కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా.. జో బైడెన్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించే రోజే.. ట్రంప్ చేత ప్రమాణ స్వీకారం చేయించేందుకు సన్నద్ధమవుతున్నారు.
వర్చువల్ వేడుకలు..
వచ్చే జనవరి 20న బైడెన్.. అమెరికా పగ్గాలను చేపట్టనున్నారు. అయితే అదే రోజున ట్రంప్‌తో రెండోసారి ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఆయన మద్దతుదారులు. వర్చువల్‌గా ఈ వేడుకను జరపడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. "డొనాల్డ్ జే ట్రంప్. 2వ ప్రెసిడెన్షియల్ ఇనాగరేషన్ సెర్మనీ"కి హాజరయ్యేందుకు.. ఫేస్బుక్లో 60వేలకుపైగా మంది ఉత్సాహం చూపించారు.
ఇదీ చూడండి:- నిరాడంబరంగానే బైడెన్, హారిస్ ప్రమాణం
జనవరి 20న స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12గంటలకు ఈ కార్యక్రమం ఉండనుంది. ట్రంప్ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్న ఇలిర్ చామి, ఇవి కొకాలారి ఈ వేడుకను నిర్వహించనున్నారు.
అయితే ఎఫ్బీ పోస్ట్ కింద.. ఓ డిస్క్లైమర్ను జోడించారు. " 3,25,000మందితో కూడిన వ్యక్తిగత బృందం మాది. మేము ట్రంప్ మద్దతుదారులం. ఈ విధంగా ట్రంప్‌కు మద్దతిస్తున్నాం. అధికారిక అధ్యక్షుడి ప్రమాణస్వీకారంతో మాకు, ఈ వేడుకకు సంబంధం లేదు," అని పోస్ట్ చేశారు. ఎఫ్బీ కూడా ఇదే తరహాలో కింద మరో డిస్క్లైమర్ను జోడించింది. "అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్. జనవరి 20న.. దేశ 46వ అధ్యక్షుడిగా ఆయన ప్రమాణస్వీకారం చేస్తారు" అని పేర్కొంది.
ఇదీ చూడండి:- సొంతింటికి వెళ్లేందుకూ ట్రంప్‌కు ఇక్కట్లు!