ప్రపంచంపై కొవిడ్ పంజా విసురుతోంది. కేసుల సంఖ్య 25 లక్షలు దాటగా.. మొత్తం మరణాల సంఖ్య 1,71,741కి పెరిగింది. 6,58,956 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. అమెరికాలో ఇప్పటివరకు 7 లక్షల 92 వేల 938 కేసులు నమోదయ్యాయి. ఇదే ప్రపంచంలో అత్యధికం. ఆ తర్వాతి స్థానంలో స్పెయిన్ (2,04,178), ఇటలీ (1,81,228) కేసులతో ఉన్నాయి.
స్పెయిన్‌లో మళ్లీ పెరుగుదల...
స్పెయిన్‌లో కరోనా మృతులు పెరుగుతున్నారు. దాదాపు 4 వారాల్లో తొలిసారి 399 మార్కు దాటి మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 430 మంది మహమ్మారి కారణంగా చనిపోయారు. ఫలితంగా దేశవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 21,282కి చేరింది.
తాజాగా 4వేల కేసులు నమోదవగా.. బాధితుల సంఖ్య 2,04,178కి చేరింది. గత నాలుగు రోజులుగా 2 శాతం కేసులు పెరిగినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు.
సింగపూర్‌లో వేయి కేసులు...
సింగపూర్‌లో తాజాగా 1,111 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 9,125కి చేరింది. దక్షిణాసియా దేశాల్లో సింగపూర్ ఈ వైరస్‌తో ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు నాలుగు వారాల పాటు (జూన్ 1 వరకు) పాక్షికంగా లాక్డౌన్ ప్రకటించింది.
పాక్‌లో మరో 16 మంది మృతి...
పాకిస్థాన్‌లో మరణాల సంఖ్య పెరుగుతోంది. మరో 16 మంది వైరస్ కారణంగా చనిపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 192కు చేరగా.. కేసులు 9,216గా నమోదయ్యాయి
చైనాలో 21 కేసులు...
చైనాలో దాదాపు మూడు వారల తర్వాత మళ్లీ కొత్త కేసులు పెరుగుతున్నాయి. షాంగ్జీ రాష్ట్రంలో తాజాగా 21 కేసులు పాజిటివ్‌గా నమోదయ్యాయి. మరో 7 కేసులు లక్షణాలు లేని కరోనా కేసులుగా నిర్ధరించారు. ఇప్పటివరకు ఈ దేశంలో 82,758 కేసులు రాగా.. 4,632 మంది చనిపోయారు.
మలేసియాలో 3 మరణాలు...
మలేసియాలో 57 కొత్త కేసులు సహా 3 మరణాలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం బాధితుల సంఖ్య 5,482కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 92కి పెరిగింది. వరుసగా ఐదోరోజు రెండంకెల కేసులు నమోదవడం ఆ దేశాన్ని కలవరపెడుతోంది.
ఇదీ చదవండి: ఏడాది చివరిలోగా చైనా వైద్యులకు కరోనా వ్యాక్సిన్!