శ్వేతసౌధంలో కరోనా నిబంధనలు అమల్లోకి వచ్చాయి. డెస్కుల మధ్య దూరం పాటించడం సహా టెస్టింగ్ రిస్ట్ బ్యాండ్లు, మాస్కులను తప్పనిసరిగా ధరించాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. కొత్త అధ్యక్షుడి రాకతో వైట్‌హౌస్‌లో ఈ నిబంధనలన్నీ అమలవుతున్నాయి.
ఇక్కడ పనిచేసే సిబ్బంది ప్రతిరోజు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, ఎన్95 మాస్కులను తప్పక ధరించాలని శ్వేతసౌధ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకి ఇదివరకే స్పష్టం చేశారు. కరోనా పరీక్షలు నిర్వహించుకున్నట్టు సూచించే చేతి బ్యాండ్లను జో బైడెన్‌కు సమీపంలో పనిచేసే అధికారులకు ఇస్తున్నారు. అధ్యక్షుడి దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిపై నిఘా ఉంచుతున్నారు. బైడెన్ ప్రసంగించేటప్పుడు ఎవరు ఎక్కడ నిల్చోవాలో సూచించేలా కార్పెట్‌పై గుర్తులు వేస్తున్నారు. సిబ్బంది వాడే ల్యాప్‌టాప్ వాల్‌పేపర్‌పై కరోనా లక్షణాలు, అవి కనిపిస్తే సంప్రదించాల్సిన శ్వేతసౌధ వైద్యుల నెంబర్లను ఏర్పాటు చేశారు. గురువారం కొవిడ్ బృందంతో బైడెన్ సమావేశమైన సమయంలోనూ.. అధికారులను కనీసం ఆరు అడుగుల దూరంలో కూర్చోబెట్టారు. శ్వేతసౌధ కొవిడ్ ఆపరేషన్స్ డైరెక్టర్ జెఫ్రీ వెక్స్లర్ కరోనా నిబంధనల అమలును పర్యవేక్షిస్తున్నారు.
ట్రంప్‌కు భిన్నంగా..
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధ నిర్వహణ తీరుకు పూర్తి భిన్నంగా కరోనా నిబంధనలను పక్కాగా అమలు చేయాలని బైడెన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ట్రంప్ హయాంలో కనీసం మూడుసార్లు కరోనా వ్యాప్తికి శ్వేతసౌధం కేంద్రంగా మారింది. ఇలా కాకుండా.. సొంతంగా నిబంధనలను పాటించడం వల్ల ప్రజలకు బలమైన సందేశం వెళ్తుందని బైడెన్ అధికార బదిలీ బృందంలోని బెన్ లాబోల్ట్ పేర్కొన్నారు. కరోనా పోరులో దేశ ప్రజలను ముందుండి నడిపించడంలో ఇది ఓ భాగమని అన్నారు. కరోనా పోరు ఇంకా ముగియలేదని, ప్రతి అమెరికన్‌కు వ్యాక్సిన్ అందించేవరకు ఈ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: బైడెన్ రాకతో ట్రంప్ 'సోడా బటన్' మాయం