ప్రముఖ డిక్షనరీ కంపెనీ మెరియమ్ వెబ్‌స్టర్ అనూహ్యం నిర్ణయం తీసుకుంది. 'రేసిజం' అనే పదానికి మరిన్ని అర్థాలు జోడించేందుకు సిద్ధమైంది. అమెరికాలోని మిస్సోరికి చెందిన ఓ మహిళ ఈమెయిల్ చేసిన నేపథ్యంలో ఈ చర్యలకు ఉపక్రమించింది.
ఇదీ జరిగింది...
సెయింట్ లూయిస్ సబర్బ్ ఫ్లోరిసెంట్లో నివసించే కెన్నడీ మిట్చుమ్.. తన స్నేహితులతో జాతివివక్ష(రేసిజం) విషయంపై చర్చించింది. ఆ క్రమంలో అర్థం కోసం డిక్షనరీలో చూడగా.. అందులో సరైన సమాచారం లేనట్లు గుర్తించింది. వెంటనే ఈమెయిల్ ద్వారా వాటి స్క్రీన్ షాట్లు తీసి ఫిర్యాదు చేసింది. "జాతి అనేది మానవ లక్షణాలు, సామర్థ్యాల ప్రాథమిక నిర్ణయాధికారి..., ఒక నిర్దిష్ట జాతి స్వాభావిక ఆధిపత్యం" అని నిఘంటువులో ఉండటం మాత్రమే జాతి వివక్ష కాదని చెప్పింది.
"జాతి వివక్ష అంటే ఏంటో నాకు తెలుసు. చాలా కాలంగా విభిన్న రూపాల్లో మేము దాన్ని ఎదుర్కొంటున్నాం. అందుకే ఆ విషయంపై మరింత సమాచారం జోడించాలని సూచించాను."
--కెన్నడీ మిట్చుమ్
జాతి వివక్ష అంటే "కొన్ని వర్గాల పట్ల వ్యవస్థాగత అణచివేత" అనే అర్థం కూడా వస్తుందని.. దాన్ని జోడించాలని ఆమె సూచించింది.