ప్రపంచవ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కార్మికులకు కరోనా సోకే ముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ వలస కార్మికుల సంస్థ ( ఐఎంఓ) ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా విజృంభణతో విధించిన ప్రయాణ ఆంక్షలు భవిష్యత్తులో వలస కార్మికులపై మరింత ప్రభావం చూపనున్నాయని పేర్కొంది.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విలేకరులతో మాట్లాడారు ఐఎంఓ డైరెక్టర్ జనరల్ ఆంటోనియో విటోరినో. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కొన్ని దేశాలు ఇమ్యూనిటీ పాస్‌పోర్టులు ప్రవేశపెట్టడం, మొబైల్ యాప్‌లు రూపొందించటాన్ని సూచిస్తూ.. ఆరోగ్యమే మహాభాగ్యమని పేర్కొన్నారు.
" ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో వలస జీవుల ఆరోగ్యాన్ని తనిఖీ చేసేందుకు పలు వ్యవస్థలు ఉన్నప్పటికీ.. ప్రస్తుతం మరింత డిమాండ్ పెరుగుతున్నట్లు నమ్ముతున్నా. మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన ప్రయాణ ఆంక్షలు గతంలో కంటే ఎక్కువ హాని కలిగిస్తున్నాయి. ఆగ్నేయాసియా, తుర్పు ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో సరిహద్దులు మూసివేయడం సహా ప్రయాణ ఆంక్షలతో చాలా మంది వలస కార్మికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. ఎలాంటి కనీస సౌకర్యాలు, ఆరోగ్య పరీక్షలు లేకుండా చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉన్నారు. వారికి వైద్యం అందించేందుకు అనుమతించాలని ఆయా దేశాల ప్రభుత్వాలను కోరాం."
– ఆంటోనియో విటోరినో
అదే మా తక్షణ కర్తవ్యం..
వలసదారులు ఆరోగ్య సంరక్షణ, ఇతర సహాయం పొందేలా చూడటమే ఐఎంఓ తక్షణ కర్తవ్యమని పేర్కొనారు విటోరినో. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 1100 శిబిరాల్లో కొత్త కేసులు నమోదుకాకుండా నిరోధించటం తమ మొదటి ప్రాధాన్యాంశమని తెలిపారు.
పశ్చిమ, మధ్య, తూర్పు ఆఫ్రికాలోని ఎడారి ప్రాంతాల్లో చిక్కుకున్న వారి దుస్థితిని ప్రత్యేకంగా ప్రస్తావించింది ఐఎంఓ. కరోనా సంక్రమణకు మించి వలసదారులపై విద్వేషం, హింస పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది.