అమెరికాలోని అలాస్కా పీఠభూమిలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో అధికారులు భూకంప కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల వరకు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. సముద్ర తీరానికి సమీపంలో, దీవుల్లో, దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలంటూ సైరన్ మోగించారు.
బుధవారం 06:12 గంటలకు ప్రకంపనలు వచ్చాయి. ఆంకోరేజ్‌కు నైరుతి దిశగా 800 కిలోమీటర్ల దూరం, పెర్రివిలెకు ఆగ్నేయం దిశగా 96 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. తీవ్రత, ఇతర ప్రమాణాలను బట్టి భూకంప కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల వరకు ప్రమాదకరంగా సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.
భూకంపం తర్వాత చాలాసేపటి వరకు సాధారణ అలలు మాత్రమే రికార్డవ్వగా... అలాస్కాలోని కొన్ని ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు. అయితే కొడియాక్ దీవుల్లో దిగువ ప్రాంతాల్లో ఉన్న వేలాది మందిని ఖాళీ చేయించారు. ఇప్పటి వరకు ప్రమాదకర అలలేవీ రాలేదని ఈసారి వస్తాయని కచ్చితంగా చెప్పలేమని ఓ అధికారి అన్నారు. అన్నిటికీ సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: నోబెల్ వేడుకపైనా కరోనా ప్రభావం- విందు రద్దు