అంతరిక్ష వీధుల్లో తెలుగు కీర్తి పతాకం రెపరెపలాడే సమయం ఆసన్నమైంది. రోదసియానం చేయనున్న తొలితెలుగు మహిళగా గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష చరిత్ర సృష్టించనున్నారు. ప్రముఖ అంతరిక్ష సంస్థ వర్జిన్ గెలాక్టిక్ ఆదివారం మానవ సహిత వ్యోమనౌక వీఎస్‌ఎస్ యూనిటీ-22ని నింగిలోకి పంపనుంది. అందులో ఆసంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్తో పాటు మరో అయిదుగురు ప్రయాణించనుండగా వారిలో 34ఏళ్ల శిరీష కూడా ఉన్నారు.
శిరీష వ్యోమనౌకలో పరిశోధన అంశాలను పర్యవేక్షించనున్నారు. ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఒక ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. ఈ యాత్ర విజయవంతమైతే భారత్ నుంచి అంతరిక్షానికి వెళ్లిన నాలుగో వ్యోమగామిగా శిరీష చరిత్ర పుటలకెక్కనున్నారు. ఇంతకుముందు రాకేశ్ శర్మ, కల్పనా చావ్లా, భారత-అమెరికన్ సునీతా విలియమ్స్ రోదసిలోకి వెళ్లి వచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో జన్మించిన బండ్ల శిరీష తల్లిదండ్రులతోపాటు అమెరికాలోని హ్యూస్టన్‌లో స్థిరపడ్డారు. పర్‌డ్యూ విశ్వవిద్యాలయం నుంచి ఏరోనాటికల్-ఆస్ట్రోనాటికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. జార్జ్ వాషింగ్టన్ వర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తిచేశారు. ప్రస్తుతం ఆమె వర్జిన్ గెలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాలు, పరిశోధన కార్యకలాపాల విభాగానికి ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు.
ఇవీ చదవండి:
Sirisha Bandla: అంతరిక్షంలో తెలుగమ్మాయి తొలి అడుగు!
Space tour: తొలిసారిగా అంతరిక్షంలోకి తెలుగు మూలాలు ఉన్న మహిళ