15ఏళ్ల వయసున్న అమ్మాయిలు సాధారణంగా కార్టూన్లు చూస్తూ, ఎక్కువగా ఆడుకోవడానికి ఇష్టపడతారు. హితా గుప్తా మాత్రం అమెరికాలోని వందలాది మందిలో ఒంటరితనాన్ని పోగొడుతోంది. కొవిడ్ నియంత్రణ క్రమంలో ఆశ్రమాల్లో నిర్బంధ జీవితం గడుపుతున్న పిల్లలు, వృద్ధులకు కానుకలు పంపుతూ నూతనోత్సాహం నింపుతోంది.
పెన్సిల్వేనియాలోని కోనెస్టాగో హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న హిత.. 'బ్రైటెనింగ్ ఎ డే' అనే సేవా సంస్థను నిర్వహిస్తోంది. ఈ నర్సింగ్ హోంలో ఉండే వారికి, ప్రధానంగా వృద్ధులకు, లాక్డౌన్ కాలంలో ప్రేమ, ఆనందాన్ని పంచుతోంది. ఈ ఒంటరి సమయంలో వారికి ఊరటనిచ్చేలా.. తను స్వయంగా రాసిన లేఖలు, పజిల్ గేమ్స్, రంగురంగుల పుస్తకాలు, కలర్ పెన్సిళ్లను ఓ కానుకగా ప్యాక్ చేసి పంపిస్తోంది గుప్తా.
ఆశ్రమాల్లో నివాసముంటున్న వారు.. ఈ సమయంలో తమ ప్రియమైన వారిని చూడలేరు. అప్పుడు వారు ఎంత ఒంటరితనాన్ని, నిరాశను అనుభవిస్తున్నారో ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉంది. సుమారు 40శాతం మంది రోజూ ఒంటరితనంతో బాధపడుతున్నట్లు ఓ పరిశోధనలో తేలింది.
హితా గుప్తా, భారత సంతతి విద్యార్థి
ఇప్పటివరకు అగ్రరాజ్యంలోని ఏడు వేర్వేరు రాష్ట్రాల్లో 50 ఆసుపత్రులకు, నర్సింగ్ హోంలోని 2,700 మంది పిల్లలు, వృద్ధులకు హిత నుంచి కానుకలు అందాయి. భారత్‌లోని అనాథాశ్రమాలకూ పాఠశాల సామగ్రి, తదితర వస్తువులను పంపించినట్లు తెలిపింది ఆమె.
పరుల కోసం ఇంతటి చొరవ చూపిన హితపై భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రశంసల వర్షం కురిపించింది.
ఇతరులకు సాయం చేసేందుకు మీరు స్ఫూర్తి కావాలా? అయితే అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఉన్న 15ఏళ్ల హితా గుప్తా గురించి తెలుసుకోండి. తన సేవా సంస్థ ద్వారా నర్సింగ్ హోమ్‌లలో ఉంటున్న ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది.
-అమెరికా రాయబార కార్యాలయం
అగ్రరాజ్యంలో కరోనా వ్యాప్తి కారణంగా ఆశ్రమాల్లోని వృద్ధులను నాలుగు గోడలకే పరిమితం చేశారు అధికారులు. బయటి వ్యక్తులు ఎవ్వరూ వారిని సందర్శించేందుకు అనుమతి లేదు. ఫలితంగా వారంతా ఒంటరితనాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది.