అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో రాజీనామా చేయాలని ఒత్తిడి పెరుగుతోంది. 11 మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, తనపై ఆరోపణలు చేసిన ఓ మహిళను భయపెట్టేందుకు ప్రయత్నించారని దర్యాప్తులో తేలిన క్రమంలో అధ్యక్షుడు జో బైడెన్ సహా పలువురు డెమొక్రటిక్ నేతలు గవర్నర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
'ఆయన తప్పకుండా రాజీనామా చేయాలి' అని మీడియాతో అన్నారు జో బైడెన్. స్పీకర్ నాన్సీ పెలోసీ, న్యూయార్క్ సెనేటర్ చుక్ చుమెర్, కిర్స్టేన్ గిలిబ్రాండ్ సహా డెమొక్రాట్ల నుంచి సైతం అదే డిమాండ్ ప్రతిధ్వనిస్తోంది. క్యూమో ఎంతోకాలం పదవిలో కొనసాగబోరని స్పష్టంగా తెలుస్తోందని న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కార్లే హీస్టీ తెలిపారు. వీలైనంత త్వరగా అభిశంసన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
ఐదు నెలల పాటు విచారణ..
గవర్నర్ క్యూమోపై వచ్చిన లైంగిక ఆరోపణలపై సుమారు ఐదు నెలల పాటు దర్యాప్తు చేపట్టారు. న్యూయార్క్ అటార్నీ జనరల్ నేతృత్వంలో మరో ఇద్దరు న్యాయవాదుల ఆధ్వర్యంలో ఈ దర్యాప్తు సాగింది. రాష్ట్ర ప్రభుత్వంలోని, బయటి విభాగాలకు చెందిన సుమారు 11 మంది మహిళలు క్యూమోపై ఆరోపణలు చేసినట్లు తేల్చారు. అనుచితంగా ప్రవర్తిస్తూ తమను తాకారని, తమ శరీర ఆకృతిపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసేవారని చెప్పినట్లు వెల్లడించారు. గరవర్నర్తో పాటు 179 మందిని ప్రశ్నించినట్లు దర్యాప్తు బృందం తెలిపింది.
'ఆధారాలు, పలువురు ఇచ్చిన వాంగ్మూలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గవర్నర్ క్యూమో.. రాష్ట్రంలోని ప్రస్తుత, మాజీ ఉద్యోగులపై ఫెడరల్, రాష్ట్ర చట్టాలను ఉల్లంఘించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. క్యూమోపై ఫిర్యాదు చేస్తే తమపై ప్రతీకార దాడులకు పాల్పడతారేమోననే భయంతో ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఆయన కార్యాలయం ఒక భయకరమైన పని ప్రదేశం. ' అని న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ తెలిపారు.
దర్యాప్తు బృందం క్యూమోపై 165 పేజీల నివేదికను సమర్పించింది. దాంతో ఆయన రాజీనామాకు డిమాండ్లు పెరుగుతున్నాయి.
ఏడాది క్రితం కొవిడ్-19 మహమ్మారిని కట్టడి చేయటంలో మంచి పనితీరు కనబరిచారని క్యూమో ప్రశంసలు అందుకోవటం గమనార్హం.
ఖండించిన క్యూమో..
తనపై వచ్చిన ఆరోపణలు గవర్నర్ క్యూమో ఖండించారు. 'వాస్తవాలు చాలా భిన్నంగా ఉన్నాయి. ఎవరినీ, ఎప్పుడూ అనుచితంగా తాకలేదు. లైంగికంగా వేధించలేదు.' అని పేర్కొన్నారు. ఈ విషయంపై అసెంబ్లీ స్పీకర్ హీస్టీతో క్యూమో ఫోన్ మాట్లాడినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. తాను ఆఫీస్‌ను వదలాలనుకోవట్లలేదని, డెమొక్రాట్లతో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు స్పీకర్‌కు తెలిపారని చెప్పారు. అభిశంసనను ఎదుర్కొనేందుకు కావాల్సిన మద్దతు ఉందని చెప్పారన్నారు.
ఇదీ చూడండి: మళ్లీ లక్షకుపైగా కేసులు- గవర్నర్లకు బైడెన్ హెచ్చరిక