Covid impact on Education: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా పాఠశాలల మూసివేతతో విద్యార్థులకు కనీవినీ ఎరుగని స్థాయిలో అభ్యాసన నష్టం వాటిల్లిందని ప్రపంచ బ్యాంకు ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల ఈ తరం విద్యార్థులు ప్రస్తుత విలువ ప్రకారం తమ జీవితకాలంలో ఆర్జించే 17 లక్షల కోట్ల డాలర్ల సంపాదనను కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. గతేడాది అంచనా వేసిన 10 లక్షల కోట్ల డాలర్ల నష్టాన్ని మించి ఇది నమోదైనట్లు వెల్లడించింది. ఇది ప్రపంచ జీడీపీలో సుమారు 14 శాతం అని వివరించింది. లాక్‌డౌన్ పరిస్థితుల్లో విద్యారంగంపై పడిన దుష్ప్రభావానికి సంబంధించి 'స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ క్రైసిస్: ఏ పాథ్ టు రికవరీ రిపోర్ట్' పేరుతో ప్రపంచ బ్యాంకు ఓ నివేదికను విడుదల చేసింది. యునెస్కో, యునిసెఫ్ సహకారంతో రూపొందించిన ఈ నివేదికలో పలు ఆందోళనకర విషయాలను వెల్లడించింది. ఆ వివరాలు..
- మహమ్మారికి ముందు అల్ప, మధ్య ఆదాయ దేశాల్లోని 53 శాతం మంది విద్యార్థులు విద్యావకాశాలకు దూరంగా ఉండగా, లాక్‌డౌన్‌లో అది 70 శాతానికి పెరిగింది. దీర్ఘకాలం పాటు పాఠశాలల మూసివేత, ఆన్‌లైన్ తరగతులకు అవసరమైన సౌకర్యాలు లేకపోవడం దీనికి ప్రధాన కారణం.
- కరోనా సంక్షోభం మొదలై సుమారు 21 నెలలు గడిచినా ఇప్పటికీ పెద్ద ఎత్తున పాఠశాలలు తెరవకపోవడంతో లక్షల మంది పిల్లలు చదువుకు దూరమయ్యారు. ప్రస్తుత తరానికి జరుగుతున్న అభ్యాసన నష్టం వల్ల భవిష్యత్తులో ఉత్పాదకత ఆందోళనకరస్థాయిలో పడిపోనుంది. తద్వారా వారి సంపాదనతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర దుష్ప్రభావం పడనుంది.
- బడులకు దూరం కావడం వల్ల గ్రామీణ భారతంతో పాటు పాకిస్థాన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, మెక్సికో తదితర దేశాల్లో విద్యార్థులు గణితంతో పాటు చదవడంలోనూ బాగా వెనుకబడ్డారు. పాఠశాలల మూసివేత కాలానికి, విద్యార్థుల అభ్యాసన నష్టానికి ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు తేలింది. అయితే విద్యార్థుల సామాజిక, ఆర్థిక స్థితిగతులు, జెండర్ తదితర అంశాలూ అభ్యాసన నష్టం స్థాయి పెరగడానికి కారణమయ్యాయి.
- విద్యారంగానికి ఉపశమనం కలిగించడానికి ఇప్పటివరకూ ప్రభుత్వాలు ఉద్దీపన ప్యాకేజీల్లో 3 శాతమే కేటాయించాయి. ఆ వాటాను పెంచాలని ప్రపంచ బ్యాంకు పేర్కొంది.
- అల్పాదాయ, అత్యల్పాదాయ దేశాల్లోని 20 కోట్ల మందికి పైగా విద్యార్థులకు నాణ్యమైన ఆన్‌లైన్ బోధన అందలేదు. విద్యార్థులను కనీసం ముందు తరం వారికి సాటిగా తీర్చిదిద్దడానికి వెంటనే పాఠశాలలను తెరవాల్సిన అవసరం ఉందని ప్రపంచ బ్యాంకు సూచించింది. విద్యార్థుల సామర్థ్యం ఆధారంగా ప్రత్యేక బోధన పద్ధతులు అనుసరించాలని పేర్కొంది.
ఇదీ చూడండి: ప్రత్యేక హోదా కోసం నీతి ఆయోగ్‌కు మంత్రి లేఖ- పరిస్థితి ఏం బాగాలేదంటూ..