అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప్రవేశపెట్టిన అభిశంసన, తాను నామినేట్ చేసిన సభ్యుల ధ్రువీకరణ ప్రక్రియలను విడదీయాలని జో బైడెన్ సూచించారు. సమావేశం జరిగే రోజు తొలి అర్ధభాగం అభిశంసనపై చర్చించి, మిగిలిన సమయం సభ్యుల నామినేషన్ ధ్రువీకరించడానికి కేటాయించాలని కాంగ్రెస్‌ను కోరారు. దీనిపై ఉభయసభల సభ్యులతో చర్చించానని, అయితే వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు.
అయితే, ఉద్దీపన బిల్లు ఆమోదం పొందడమే తొలి ప్రాధాన్యంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు బైడెన్. ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడమే తన కర్తవ్యమన్నారు. వీటిపై రూపొందించిన ప్రణాళికలను గురువారం వివరిస్తానని చెప్పారు.
మరోవైపు, ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని క్యాపిటల్ భవనానికి వెలుపల నిర్వహించేందుకు తాను భయపడటం లేదని స్పష్టం చేశారు బైడెన్. ఇటీవల అక్కడ జరిగిన దాడిని ప్రస్తావించిన ఆయన... ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించినవారిని శిక్షించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. మెజారిటీ డెమొక్రాట్లు, రిపబ్లికన్లు సైతం ఇలాగే భావిస్తున్నారని అన్నారు.
ఇదీ చదవండి: ఎమర్జెన్సీ పరిస్థితుల మధ్య బైడెన్ ప్రమాణస్వీకారం!