అమెరికా రక్షణ విభాగం 'పెంటగాన్' తమకు సహకారం అందివ్వటం లేదని జో బైడెన్ అధికార మార్పిడి బృందం అసహనం వ్యక్తం చేసింది. తమతో సమావేశాలు జరపటం లేదని తెలిపింది. పెంటగాన్లోని రక్షణ అధికారులు మాత్రం ఇరు వర్గాల పరస్పర ఒప్పందం ప్రకారమే సమావేశాలను సెలవు రోజుల్లో నిలిపివేశామని తెలిపారు. అయితే.. అధికారులు కలిసి పనిచేయకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని బైడెన్ బృందం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యోహన్నెస్ అబ్రహాం అభిప్రాయపడ్డారు.
కారణం అదేనా!
జో బైడెన్ అధికార బృందం ప్రస్తుతం ఉన్న కార్యక్రమాలు, సవాళ్లపై పునఃపరిశీలన జరుపుతోంది. అయితే తమకు ట్రంప్ వర్గం సహకరించటం లేదని బైడెన్ బృందం తెలిపింది. జో బైడెన్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినట్టు ట్రంప్ అధికారులు ఇంకా నిర్ధరణకు రాలేదన్నారు. జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ట్రంప్ చేతిలో ఉన్నందున బైడెన్ బృందానికి సహకరించకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు.
అయితే.. వచ్చేవారం పునఃప్రారంభం కానున్న సమావేశాల్లో 'ఆపరేషన్ వార్ప్ స్పీడ్', కొవిడ్-19 అంశాలపై దృష్టిసారిస్తామని అమెరికా రక్షణ శాఖ సెక్రటరీ క్రిస్టోఫర్ మిల్లర్ తెలిపారు. అయితే సమావేశాల నిలిపివేతపై తమ మధ్య ఎలాంటి ఒప్పందాలు జరగలేదన్నారు అబ్రహాం.
ఇదీ చదవండి : బహిరంగంగా కరోనా టీకా తీసుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు