అమెరికాలో పవన విద్యుత్ వినియోగాన్ని పెంచాలని బైడెన్ సర్కార్ యోచిస్తోంది. దేశ తూర్పు తీరంలో ఇందుకోసం ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవాలని యత్నిస్తోంది. న్యూజెర్సీ తీరంలో భారీ విండ్ ఫార్మ్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రాథమిక చర్యలు చేపట్టింది. తద్వారా 2030 నాటికి కోటి గృహాలకు విద్యుత్ అందించాలని సంకల్పించుకుంది.
ఈ ప్రాజెక్టు ద్వారా విద్యుత్ అందుబాటులోకి రావడమే కాకుండా.. వేలాది ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. 44 వేల మంది కార్మికులు, 33 వేల ఇతర ఉద్యోగులకు పని దొరుకుతుంది. దీంతోపాటు ఏడాదికి 7.8 కోట్ల మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాలకు అడ్డుకట్ట పడనుంది.
"వాతావరణ మార్పులకు పరిష్కారంతో పాటు.. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని అధ్యక్షుడు జో బైడెన్ విశ్వసిస్తున్నారు. తీరప్రాంత పవన విద్యుత్ రంగంలో ఉన్నన్ని అవకాశాలు మరెక్కడా లేవు. ఈ రంగంపై దృష్టిసారించడం వల్ల మధ్యతరగతి ప్రజలు, వెనకబడిన వర్గాలకు ప్రయోజనం కలుగుతుంది."
-గినా మెకార్తీ, వైట్‌హౌస్ క్లైమెట్ అడ్వైజర్
న్యూజెర్సీ దక్షిణ తీరంలోని సముద్ర గాలుల వల్ల ఏటా 1,100 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. 2024 నాటికి ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. పర్యావరణ మార్పులకు వ్యతిరేక పోరాటంలో భాగంగా 2030 నాటికి తీరప్రాంత పవన విద్యుత్ ఉత్పత్తిని రెట్టింపు చేయాలని బైడెన్ ప్రభుత్వం గతంలోనే నిర్ణయించుకుంది.
ఇదీ చదవండి: 'మౌలిక' అజెండాతో బైడెన్ తొలి విడత ఆర్థిక ప్యాకేజీ