అమెరికాలో టీకా పంపిణీ వేగవంతం చేయడానికి బైడెన్ ప్రభుత్వం మరో 20 కోట్ల డోసులు కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని శ్వేతసౌధం మంగళవారం ప్రకటించింది. వేసవి నాటికి 30 కోట్ల జనాభాకు సరిపడా డోసులు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేసింది. ఇప్పటికే 40 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది.
"ఫైజర్, మోడెర్నాల నుంచి చెరో పది కోట్ల డోసులను కొనుగోలు చేసేందుకు బైడెన్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నిర్ణయంతో వ్యాక్సిన్ కొనుగోలు 50 శాతం పెరిగింది. వారానికి అదనంగా 14 లక్షల డోసులు అందుబాటులోకి రానున్నాయి. మరో మూడు వారాల వరకు ఇదే స్థాయిలో పంపిణీ చేసేందుకు కట్టుబడి ఉన్నాం."
- శ్వేతసౌధం, అమెరికా
టీకా పంపిణీ పెంపుపై అధ్యక్షుడు బైడెన్ బుధవారం ప్రకటన చేశారు. వచ్చే వారం నుంచి రాష్ట్రాలకు వారానికి కోటి డోసులు సరఫరా చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆ సంఖ్య 86 లక్షలుగా ఉంది.
ఇదీ చదవండి : కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్న బిల్గేట్స్