Armed man un head quarters: న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి(ఐరాస) ప్రధాన కార్యాలయం వద్ద గురువారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొన్ని గంటలపాటు ఐరాస కార్యాలయాన్ని అధికారులు మూసివేశారు. ఓ వ్యక్తి(60) తుపాకీ పట్టుకుని కార్యాలయం గేటు బయట తచ్చాడడమే ఇందుకు కారణం.
సదరు వ్యక్తిని స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మన్‌హట్టన్ ఫస్ట్ ఎవెన్యూ సెక్యూరిటీ చెక్‌పాయింట్ వద్ద అతడిని తొలిసారి గుర్తించామని అధికారులు తెలిపారు. ఐరాస కార్యాలయం వద్ద అతడు ఓ తుపాకీని తన గొంతుకు గురి పెట్టుకుని, తిరుగుతూ కనిపించాడని చెప్పారు.
ఘటనా సమయంలో ఐరాస ప్రహరీకి ఉన్న గేట్లు మూసే ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో అతడు భద్రతా నియమాలను ఉల్లంఘించినట్లు కనిపించలేదని చెప్పారు. ప్రజలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని పేర్కొన్నారు. కార్యాలయంలో ఉన్నవారిని తొలుత అక్కడే ఉండాలని అధికారులు సూచించారు. కానీ, తర్వాత వారిని వేరే మార్గాల్లో బయటకు వెళ్లేందుకు అనుమతించారు.
గురువారం ఐరాస ప్రధానకార్యాలయంలో జనరల్ అసెంబ్లీ, భధ్రతా మండలి సమావేశం జరుగుతున్న తరుణంలో ఈ ఘటన జరగడం గమనార్హం. సదరు వ్యక్తి.. ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగా? లేదా మాజీ ఉద్యోగా? అన్న విషయంపై స్పష్టత లేదని ఐరాస అధికార ప్రతినిధి స్టెఫేన్ డుజారిక్ తెలిపారు.
ఇదీ చూడండి: బిడ్డను ఆడిస్తున్న తల్లికి షాక్.. పట్టపగలే దొంగలు వచ్చి బెదిరించి...
ఇదీ చూడండి: US Shooting: అమెరికాలో కాల్పుల కలకలం- నలుగురు మృతి