అమెరికాలోని నార్త్‌కరోలినా రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఫలితంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో నదులు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వరదల కారణంగా ముగ్గురు చనిపోయారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మరోవ్యక్తి కూడా వరదలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. వీరిలో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం.
వరదల కారణంగా నార్త్ కరోలినాలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల రహదారులు కొట్టుకుపోగా... నాలుగు వంతెనలు కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. దక్షిణ యాడ్కిన్ నది ప్రమాదస్థాయిని దాటి ప్రవహించడం వల్ల నివాస ప్రాంతాల్లోకి వరద నీరు చేరి... వందలాది మంది నీటిలో చిక్కుకుపోయారు. పలు వాహనాలు కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు 31మందిని విపత్తు నిర్వహణ సిబ్బంది రక్షించారు.
భారీ వర్షాల కారణంగా విద్యత్ స్తంభాలు నేలకొరిగి.. 3,100 మందికిపైగా అంధకారంలో గడుపుతున్నారు. ఇప్పటికే రైళ్ల రాకపోకలను రద్దు చేసిన అధికారులు.. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. విపత్తు సమయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
ఇదీ చూడండి: నేపాల్‌లో బస్సు లోయలో పడి 9మంది మృతి