హైదరాబాద్ అంబర్ పేట్ డివిజన్లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని.. కేవలం మైనార్టీలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకొని వదిలేస్తున్నారని.. మైనారిటీల అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం చేసింది శూన్యమని అంబర్ పేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పీర్ మునీర్ అహ్మద్ ఆరోపించారు. అభివృద్ధి అంటే మంచిగా ఉన్న రోడ్లను తవ్వి కమీషన్ల కోసం కొత్త రోడ్లను వేయడమా అని ఆయన ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేస్తే ఎందుకు అభ్యర్థిని మార్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ అభ్యర్థి ఫిర్ మునీర్ అహ్మద్ జబీర్ విజ్ఞప్తి చేశారు.
మూసీ నది ప్రక్షాళన, మైనారిటీలకు శ్మశానవాటిక నిర్మిస్తామన్న వాగ్దానం ఏమైందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నాసిర్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి గతంలో అనేక రకాలుగా స్థానికులను ఇబ్బందులకు గురి చేశారని ఆయన ఆరోపించారు. ముస్లింలకు శ్మశాన వాటిక ఏర్పాటు చేస్తామని చెప్పి నేటికీ అమలు చేయకపోగా అదే వాగ్దానంతో మళ్లీ జిహెచ్ఎంసీ ఎన్నికలలో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారన్నారు. మూసీ నదిలో శ్మశానవాటికకు స్థలం చూపిస్తే అది మునుగుతుంది తప్ప ముస్లింలకు ఉపయోగపడదని తెలిసి కూడా అసత్య వాగ్దానాలు చేస్తున్నారని ఆరోపించారు. టిఆర్ఎస్ కూడా మరో బిజెపీ లాగా తయారైందని, ముస్లింల ఆకాంక్షలు నెరవేరాలంటే కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.