Shankar Mahadevan Doctorate: ఆయన పాట వింటే తనువు పరవశిస్తుంది. మనసు పులకరిస్తుంది. గుండె సంబరపడుతోంది. ఆయనే భారతీయ సంగీత స్వరకర్త శంకర్ మహదేవన్. 'ఆకాశం అమ్మాయితే' లాంటి రొమాంటిక్ పాట అయినా 'మహాప్రాణ గీతం' అనే భక్తిరస పాట అయినా 'కొడితే కొట్టాలిరా' అనే మాస్ సాంగ్ అయినా ఆయన తన గాత్రంతో కొత్త అందం తీసుకొస్తారు. హీరో బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ మూవీ 'అఖండ'లో ఆయన పాడిన 'భం భం అఖండ' పాట నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించింది. ఆయన పాడిన బ్రీత్‌లెస్ ట్రాక్ అప్పడు, ఇప్పడూ సూపర్‌హిట్టే.
సంగీత రంగంలో ఆయన అందించిన విశిష్ట సేవలకు గాను అమెరికాలోని బర్మింగ్‌హామ్ సిటీ యూనివర్సిటీ మహదేవన్ను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించనుంది. ముంబయిలో ఇటీవలే జరిగిన ట్రేడ్ మిషన్ ఈవెంట్ సందర్భంగా అమెరికాలోని వెస్ట్ మిడ్‌లాండ్స్ కౌంటీ మేయర్ ఆండీ స్ట్రీట్ ఈ విషయాన్ని వెల్లడించారు. 2023లో జరగబోయే ఈ కార్యక్రమానికి మహదేవన్ను అధికారికంగా ఆహ్వానించారు. "నేను నా కెరీర్ ప్రారంభించనప్పుడు ఏదో ఒక రోజు నా గాత్రానికి డాక్టరేట్ వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. నా జీవితంలో ఇది చాలా ప్రత్యేకమైన విషయం. చాలా ఆనందంగా ఉంది" అంటూ మహదేవన్ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.
తెలుగులో ఆయన పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'లో 'చంద్రుడిలో ఉండే కుందేలు పాట', 'అత్తారింటికి దారేది'లో 'అమ్మో బాపుగారి బొమ్మో' పాట,'అఖండ'లో 'భం భం అఖండ' టైటిల్ సాంగ్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. తెలుగు వ్యక్తి కాకపోయినప్పటికీ.. కఠినమైన పదాలను సైతం చాలా అలవోకగా పాడేయడం ఆయన స్పెషల్. ఉత్తమ నేపథ్య గాయకుడిగా నాలుగు సార్లు జాతీయ అవార్డును గెలుపొందారు. నాగార్జున హీరోగా నటించిన 'శిరిడి సాయి'లోని 'ఒక్కడే దేవుడు' పాటకు గాను నంది అవార్డు వరించింది. 2019లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.