Puri Jagannadh Liger Issue: 'లైగర్' సినిమా పరాజయంతో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ చిక్కుల్లో పడ్డారు. ఆ చిత్రం వల్ల ఆర్థికంగా నష్టపోయామని, డబ్బులు తిరిగి చెల్లించాలంటూ పలువురు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు బెదిరింపులకు పాల్పడుతున్నారని పూరీ జగన్నాథ్ జూబ్లిహిల్స్ పోలీసులను బుధవారం ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ప్రాణ హాని ఉందని, తమ కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ పూరీ ఫిర్యాదులో కోరడంతో పోలీసులు ఆయన నివాసం వద్ద గురువారం భద్రత కల్పించారు.
విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రమే 'లైగర్'. భారీ అంచనాలతో ఈ ఏడాది ఆగస్టు 25న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. నైజాం డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియర్ వరంగల్ శీను, శోభన్ బాబులు నష్టపోయిన డబ్బులు తిరిగి చెల్లించాలని పూరీపై ఒత్తిడి పెంచారు. సుమారు రూ.8 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, వాటిని తిరిగి ఇప్పించాలంటూ పూరీకి లేఖలు రాశారు.
ఈ విషయమై పూరీ మాట్లాడిన ఓ ఆడియో ఫైల్ రెండు రోజుల క్రితం వైరల్ అయింది. ఈ నెల 27న వారంతా తన ఇంటి ముందు ధర్నా చేయబోతున్నారని, తన పరువు తీసేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఆయన వాపోయారు. తర్వాత పోలీసులను ఆశ్రయించారు. అయితే, ప్రస్తుతం పూరీ జగన్నాథ్ హైదరాబాద్‌లో లేకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ ఆయన ఇంటిని ముట్టడించలేదు. 'లైగర్' ఆర్థిక లావాదేవీలకు సంబంధించి న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని బాధిత డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇవీ చదవండి: హాట్ టాపిక్‌గా కార్తి రెమ్యునరేషన్.. మీడియాలో జోరుగా చర్చ!