బాలీవుడ్ స్టార్ కపుల్స్‌లో కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ ఒకరు. గతేడాది మూడుముళ్ల బందంతో ఒకటయ్యారు. ప్రస్తుతం వీరిద్దరూ దాంపత్య జీవిత్యాన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే పెళ్లి తర్వాత కత్రిన తెరపై కనపడలేదు. త్వరలోనే 'ఫోన్‌బూత్' అనే హారర్ కామెడీ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించనుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ పెళ్లి తర్వాత తన భర్తతో జీవితం ఎలా సాగుతుందో చెప్పింది. అలానే విక్కీ తనను ప్రేమతో ముద్దుగా ఏమని పిలుస్తాడో కూడా తెలిపింది.
"విక్కీ ఓ అసాధారణమైన వ్యక్తి. అతడిలో ఎన్నో అద్భుతమైన క్వాలిటీస్ ఉన్నాయి. అవి నాకెంతో నచ్చుతాయి. నాకు సరిగ్గా సరిపోతాయి. అయితే అతడు నన్ను ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా? 'మై ప్యానిక్ బటన్' అని పిలుస్తాడు. నేను చాలా సందర్భాల్లో భయాందోళనకు గురౌతుంటాను. అప్పుడు అతడు ప్రశాంతంగా ఉండు 'పానిక్ బటన్' అని అంటాడు. ఏదేమైనప్పటికీ మేము ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, సమన్వయంతో ముందుకు సాగుతున్నాం. నేను అతడిని బ్యాలెన్స్ చేస్తానో లేదో నాకు తెలియదు కానీ అతను నన్ను మాత్రం బాగా బ్యాలెన్స్ చేస్తాడు" అని పేర్కొంది.
ఇటీవలే ఓ షోలోనూ విక్కీ గురించి కత్రిన మాట్లాడుతూ.. "విక్కీకౌశల్‌ని, నన్ను విధి కలిపింది. ఎందుకంటే విక్కీతో ప్రేమలో పడటానికంటే ముందు అతడి గురించి నాకేమీ తెలియదు. కేవలం పేరు మాత్రమే తెలుసు. జోయా అక్తర్ పార్టీలో అతడిని మొదటిసారి కలిసి మాట్లాడా. అతడు నావాడే అనిపించింది. మా మధ్య చాలా యాదృచ్ఛిక ఘటనలు ఉన్నాయి.. ఓ సమయంలో అవన్నీ అవాస్తవంగా కూడా అనిపించాయి. తర్వాత మేమిద్దరం కొంతకాలం డేటింగ్‌లో ఉన్నాం. విక్కీ తన ఫ్యామిలీకి ఎంతో గౌరవమిస్తాడు. నా ఫ్యామిలీని కూడా అంతే బాగా చూసుకుంటాడు. పెళ్లైన తర్వాత నా మొదటి పుట్టినరోజుని మాల్దీవుల్లో జరుపుకొన్నాం. ఆ సమయంలో నేను కొవిడ్ నుంచి అప్పుడే కోలుకుని నీరసంగా ఉన్నా. నా పరిస్థితి అర్థం చేసుకున్న విక్కీ.. సుమారు 45 నిమిషాలపాటు నా సినిమా పాటలన్నింటికీ డ్యాన్స్ చేశాడు. విక్కీతో కలిసి డ్యాన్స్ చేయలేక అందరూ సైలెంట్‌గా కూర్చొని చూస్తూ ఉండిపోయారు. విక్కీ ఫర్ఫెక్ట్‌గా డ్యాన్స్ చేశాడని చెప్పను కానీ, చేసినంత సేపు నన్ను నవ్వించడానికి ప్రయత్నించాడు" అని చెప్పుకొచ్చింది.
కాగా, సుమారు నాలుగేళ్ల నుంచి ప్రేమలో ఉన్న విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ గతేడాదిలో పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్‌లోని ఓ ప్రముఖ కోటలో వీరి వివాహ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. ప్రస్తుతం వీరిద్దరూ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న 'టైగర్-3'లో కత్రినా భాగం కాగా.. 'గోవిందా నామ్ మేరా', 'ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ', 'డుంకీ' చిత్రాలతో విక్కీ బిజీగా ఉన్నారు.
ఇక ఫోన్‌బూత్ సినిమా విషయానికొస్తే.. హారర్ కామెడీగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దయ్యం మనుషులతో కలిసి బిజినెస్ చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించనున్నారు. గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నవంబర్ 4న విడుదలకానుంది. 'గల్లీ బాయ్', 'తుఫాన్' చిత్రాల తర్వాత ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి వస్తున్న చిత్రమిది.
ఇదీ చూడండి: ఆ సినిమా కోసం సమంత అంత రిస్క్ చేసిందా?