నటశేఖరుడు, సూపర్‌స్టార్ కృష్ణకు నివాళులు అర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు, భారీగా అభిమానులు పద్మాలయ స్టూడియోకు తరలివస్తున్నారు. కృష్ణ పార్థివదేహానికి హీరో నందమూరి బాలకృష్ణ నివాళులు అర్పించారు. అనంతరం మహేశ్‌బాబు కుటుంబసభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. బాలయ్యతో పాటు ఆయన సతీమణి వసుంధర, పెద్ద కుమార్తె బ్రాహ్మణి కూడా కృష్ణ పార్థివదేహానికి శ్రద్ధాంజలి ఘటించారు.
"డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ మన మధ్య లేరన్నది నమ్మలేని నిజం. ఆయన సినీ కెరీర్లో ఎన్నో ప్రయోగాలు, సాహసాలు చేశారు. ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు. పద్మాలయ స్టూడియోస్ స్థాపించి గొప్ప సినిమాలు తీశారు. సాంఘిక, జానపద, చారిత్రక, పారాణిక చిత్రాలు తీసి అందరి హృదయాల్లో గొప్ప నటుడిగా నిలిచారు. నిర్మాతల పాలిట కల్పవృక్షం. కొత్త దర్శకులు, నిర్మాతలను ఎన్టీఆర్, కృష్ణలే పరిచయం చేశారు. కృష్ణ గారితో కలిసి సుల్తాన్‌లో నటించా. షూటింగ్ కోసం అండమాన్ వెళ్తే, నాన్న గారి గురించి ఎన్నో విషయాలు చెప్పేవారు. ఎన్టీఆర్, కృష్ణలు చిత్ర పరిశ్రమకు స్ఫూర్తి ప్రదాతలు"
-- సినీ నటుడు నందమూరి బాలకృష్ణ
ఘట్టమనేని వారసులు, మహేశ్ బాబు కుమారుడు గౌతమ్, కుమార్తె సితార కూడ తమ తాత కృష్ణ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అయితే అభిమానుల సందర్శనార్థం కృష్ణ పార్థివదేహాన్ని పద్మాలయ స్టూడియోలో బుధవారం మధ్యాహ్నం వరకు ఉంచనున్నారు. సూపర్‌స్టార్ కడసారి చూపు కోసం వేలాది మంది అభిమానులు తరలివస్తున్నారు. దీంతో స్టూడియో ముందు ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం మహాప్రస్థానంలో తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి.
ఐదున్నర దశాబ్దాలపాటు చిత్రసీమను ఏలిన నటశేఖరుడు మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్ట్‌తో ఆదివారం అర్ధరాత్రి గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు వెంటనే ఆయనకు సీపీఆర్ చేసి కార్డియాక్ అరెస్ట్ నుంచి బయటకు తెచ్చారు. అయితే కీలకమైన అవయవాలు పనిచేయకపోవడంతో ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌పై వైద్యం అందించారు. కృష్ణ క్షేమంగా తిరిగి రావాలని అభిమానులు శ్రేయోభిలాషులు ప్రార్థించారు.
సూపర్‌స్టార్‌ను బతికేందుకు వైద్యులు గంటల తరబడి శ్రమించినా ఫలితం లేకపోయింది. మంగళవారం తెల్లవారుజామున 4.09 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. తర్వాత కాంటినెంటల్ ఆస్పత్రి నుంచి కృష్ణ పార్థివదేహాన్ని నానక్‌రామ్‌గూడలోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు. బుధవారం ఉదయం పద్మాలయ స్టూడియోకు తీసుకెళ్లారు.
- ఇవీ చదవండి:
- Superstar Krishna: సాహసాల మొనగాడు.. తేనె మనసు 'బుర్రిపాలెం' బుల్లోడు
- ఎన్నో 'సూపర్' హిట్ పాటలు.. మరెన్నో అదిరిపోయే డైలాగ్‌లు.. మీసాల 'కృష్ణుడి' మహిమతో
- నటశేఖరుడు, సూపర్ స్టార్ కృష్ణ అస్తమయం.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
- ఎన్టీఆర్ మరణంపై ఈటీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో కృష్ణ ఏమన్నారో తెలుసా
- సూపర్ స్టార్ కృష్ణ విజయ నిర్మల హిట్ పెయిర్ ఎన్ని సినిమాల్లో నటించారంటే