టాలీవుడ్ నటుడు, జబర్దస్త్ ఫేమ్ చలాకీ చంటి గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నెల 21న చంటికి తీవ్రమైన ఛాతీనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వెంటనే ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు గుండెపోటుగా గుర్తించారు. వెంటనే ఐసీయూకు తరలించి చికిత్స అందించారు.
అవసరమైన పరీక్షలు నిర్వహించి.. రక్తనాళాల్లో పూడికలు ఉన్నట్లు తేలడంతో వైద్యులు స్టంట్ వేసినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి కొంత నిలకడగా ఉందని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. చంటి ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఇంతవరకు ఎక్కడా స్పందించలేదు.
కాగా, జబర్దస్త్ షోతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు చలాకీ చంటి. తనదైన కామెడీ టైమింగ్‌తో, కడుపుబ్బా నవ్వించే స్కిట్లతో ప్రేక్షకులను అలరించారు. బిగ్‌బాస్ ఆరో సీజన్‌లోనూ పాల్గొన్న ఆయన.. సినిమాల్లోనూ నటించి గుర్తింపు సంపాదించుకున్నారు. రేడియో మిర్చిలో ఆర్ర్జేగా కెరియర్ మొదలుపెట్టి తర్వాత ఆయన సినీ రంగం వైపు ఆకర్షితులయ్యారు. కొంతకాలంగా మాత్రం అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై కనిపించడం లేదు. అయితే చాలామందికి చలాకీ చంటి ఒరిజినల్ పేరు కూడా తెలియదు.
నిజానికి చలాకీ చంటి ఒరిజినల్ పేరు వినయ్ మోహన్ శర్మ. ఆయన జల్లు అనే సినిమాతో సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా తన సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత కూడా ఆయన చాలా సినిమాల్లో నటించారు కానీ బ్రేక్ అయితే లభించలేదు. ఈటీవీలో 2013లో ప్రారంభమైన జబర్దస్త్ చలాకీ చంటి పేరునే మార్చేసింది. అప్పటివరకు చంటిగా పరిచయమైన ఆయనకు చలాకీ అనే పేరు వచ్చి ఒక్కసారిగా ఫేట్ మొత్తాన్ని మార్చేసింది. చలాకీ చంటి బీకాం చదివి ఆ తర్వాత ఆర్ట్స్‌లో మాస్టర్ డిగ్రీ కూడా అందుకున్నారు. వాస్తవానికి చదువుకునే రోజుల్లో బీకాం చేసేందుకు కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో మానేశారు. ఆ తర్వాత బీకాం పూర్తి చేయడమే కాదు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసుకున్నారు. చలాకీ చంటి 2016లో శ్వేత అనే మహిళను వివాహం చేసుకున్నారు. ఆమెకు సువర్చల అనే మరో పేరు కూడా ఉంది. ఇక ఈ జంటకి 2018లో పాప జన్మించింది. ఆమెకు ధన్యత అని పేరు పెట్టారు.