మలయాళ స్టార్ మమ్ముట్టి ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి ఫాతిమా ఇస్మాయిల్ (93) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఫాతిమా.. కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. మమ్ముట్టి తల్లి మరణంతో మలయాళ చిత్రసీమలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మమ్ముట్టితో పాటు ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ మలయాళ ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు. పలువురు సినీ ప్రముఖులు మమ్ముట్టి ఫ్యామిలీకి సంతాపం తెలుపుతున్నారు. శుక్రవారం సాయంత్రం ఫాతిమా అంత్యక్రియలను స్వస్థలం కొట్టాయం సమీపంలోని చెంపులో నిర్వహించబోతున్నట్లు తెలిసింది.
మలయాళ ప్రేక్షకులతో పాటు తెలుగువారికి కూడా సుపరిచితమైన నటుడు మమ్ముట్టి. తెలుగులోనూ చాలా సినిమాల్లో నటించారు. తనదైన నటనతో టాలీవుడ్ ఆడియన్స్‌కు దగ్గరయ్యారు. గతేడాది ఆయన నటించిన చిత్రం రాస్‌చాక్. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం అక్కినేని అఖిల్ మూవీ ఏజెంట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. అయితే తల్లి మరణంతో త్వరలో రిలీజ్ కానున్న ఏజెంట్ మూవీ ప్రమోషన్స్‌కు మమ్ముట్టి దూరంగా ఉండబోతున్నట్లు సమాచారం. తెలుగుతో పాటు మలయాళంలో ఈ సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో మమ్ముట్టి కీలక పాత్రను పోషించారు.
అయితే ఇండస్ట్రీలో వరుస విషాదాలు జరుగుతున్నాయి. గురువారం.. బాలీవుడ్ దిగ్గజ దర్శక నిర్మాత యశ్ చోప్రా భార్య పమేలా చోప్రా కన్నుమూశారు. 74 ఏళ్ల పమేలా.. గత 15 రోజులుగా ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ముంబయిలో ఆమె అంత్యక్రియలను గురువారం ఉదయం 11 గంటలకు కుటుంబసభ్యులు నిర్వహించారు.
యశ్ చోప్రా సతీమణి అయినప్పటికీ.. పమేలా చోప్రా ప్లే బ్యాక్ సింగర్‌గా మంచి గుర్తింపు పొందారు. ఆమె సినీ రచయిత, నిర్మాత కూడా. పమేలా 1970లో యశ్ చోప్రాను వివాహం చేసుకున్నారు. పమేలా చోప్రా చివరిసారిగా 'ది రొమాంటిక్స్' అనే డాక్యుమెంటరీలో కనిపించారు. అందులో తన భర్త యశ్ చోప్రా, ఆయన ప్రయాణం గురించి మాట్లాడారు. యశ్ చోప్రా 2012లో మృతిచెందారు. వీరికి ఇద్దరు కుమారులు ఆదిత్య చోప్రా, ఉదయ్ చోప్రా. పెద్ద కుమారుడు ఆదిత్య చోప్రా.. సినిమాలకు దర్శక, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈయన బాలీవుడ్ నటి రాణి ముఖర్జీని వివాహం చేసుకున్నారు. చిన్న కుమారుడు ఉదయ్ చోప్రా కూడా సినీ రంగంలో ఉన్నారు. యశ్ రాజ్ ఫిల్మ్ నిర్మించిన 'ధూమ్' సిరీస్‌లో అలీఖాన్ అనే పాత్రలో నటించిన ఈయన ప్రేక్షకులకు సుపరిచితుడే. అంతే కాకుండా ప్యార్ ఇంపాజిబుల్, ముజ్సే దోస్తీ కరోగే లాంటి సినిమాల్లోనూ నటించారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే ఉదయ్.. పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.