Wife Killed Husband : ఏపీలోని కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఆల్వాలకు చెందిన ఆమోస్ హత్య కేసులో అతని భార్య అరుణతో పాటు ఆమె ప్రియుడు ములకల సూర్య ప్రదీప్, జీవన్‌కుమార్‌లను కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలులోని కార్యాలయంలో డీఎస్పీ కె.వి.మహేష్‌కుమార్, సీఐ శంకరయ్య బుధవారం వివరాలు వెల్లడించారు. ఆల్వాలకు చెందిన ఆమోస్, అరుణ ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పుడు అరుణ మైనర్ కావటంతో ఆమోస్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదవడంతో జైలుకు వెళ్లాడు. ఆమె మేజర్ అయిన తర్వాత ఇద్దరూ కాపురం పెట్టారు. వీరికి అఖిల్ అనే ఐదేళ్ల కుమారుడు సంతానం.
కర్నూలులోని ఉద్యోగ నగర్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. నగరంలోని సిటీస్కైర్ మాల్‌లో ఆమోస్ సెక్యూరిటీ గార్డుగా.. కాంప్లెక్స్‌లోని వస్త్ర దుకాణంలో అరుణ సేల్స్‌గర్ల్‌గా పనిచేసేవారు. మద్యానికి బానిసైన ఆమోస్ రోజూ భార్యను వేధించేవాడు. వీరి ఇంటి సమీపంలో ఉండే ములకల సూర్యప్రదీప్ ఓ ప్రైవేటు పాఠశాలలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తూ సాయంత్రం సమయంలో ఆటో నడిపేవాడు. అప్పుడప్పుడూ దంపతులు ఇతని ఆటోలో వెళ్లేవారు. సూర్యప్రదీప్‌తో కలిసి ఆమోస్ మద్యం తాగేవాడు. ఈ క్రమంలో అరుణకు సూర్యప్రదీప్‌తో పరిచయం ఏర్పడింది. తన భర్తను చంపి అడ్డు తొలగిస్తే పెళ్లి చేసుకుంటానని సూర్యప్రదీప్‌తో అరుణ చెప్పింది. దీంతో అతడు హత్యకు పథక రచన చేసి తన స్నేహితుడు జీవన్‌కుమార్‌కు విషయం చెప్పాడు.
22వ తేదీ రాత్రి సూర్యప్రదీప్, జీవన్‌కుమార్.. ఆమోస్‌ను తీసుకొని శరీన్‌నగర్ సవారీతోట హంద్రీ నది ఒడ్డుకు తీసుకెళ్లారు. అతనికి మద్యం తాగించి వెంట తెచ్చుకున్న ఫ్యాను రాడ్డుతో బలంగా కొట్టి చంపేశారు. సూర్యప్రదీప్ పెట్రోలు తీసి నిప్పంటించాడు. శవం పూర్తిగా కాలకపోవడంతో హంద్రీ ఒడ్డుకు ఈడ్చుకెళ్లి పడేసి వెళ్లిపోయాడు. తర్వాత అతను అరుణకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. 24న శవం బయటపడటంతో కర్నూలు నాలుగో పట్టణ సీఐ శంకరయ్య కేసు నమోదు చేశారు. అనుమానంతో అరుణను విచారించటంతో అసలు విషయం బయటపడింది.
ఇవీ చదవండి