బస్‌లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు కిలాడీ లేడీలను(Kilady Ladies) వరంగల్ పోలీసులు (Warangal Police) అరెస్టు చేశారు. రద్దీగా ఉన్న బస్సుల్లో, ఆటోల్లో ప్రయాణిస్తూ ఒంటరిగా ఉన్న మహిళలే లక్ష్యంగా చేసుకోని దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీరి నుంచి రూ. 24 లక్షలు విలువ చేసే 473 గ్రాముల బంగారు ఆభరణాలు, నాలుగు సెల్‌ఫోన్లు, చోరీలకు పాల్పడిన అనంతరం తప్పించుకునేందుకు వినియోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
టైలరింగ్ వదిలి...
నిందితురాళ్లు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి (Warangal Cp Tarun Joshi) తెలిపారు. వీరు ఇదివరకు టైలరింగ్ వృత్తి చేసేవారని... ఈ విధంగా వచ్చే ఆదాయం సరిపోకపోవడం వల్లే సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో దొంగతనాలు మొదలు పెట్టారని వెల్లడించారు.
ఇందులో భాగంగానే నిందితురాళ్లు ఇరువురు వేర్వేరుగానే రద్దీగా ఉండే బస్సులు, ఆటోల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళలను లక్ష్యంగా చేసుకుని బంగారు అభరణాలను చోరీ చేసేవారని సీపీ పేర్కొన్నారు. వీరిద్దరిని గతంలో పలుమార్లు అరెస్టు చేసిన జైలుకు తరలించారని చెప్పారు. జైలు నుంచి బయటకు వచ్చాకా నిందితులు తమని ఎవరూ గుర్తుపట్టని విధంగా శ్రీమంతుల తరహలో ఖరీదైన చీరలను ధరించి... వేషధారణ మారుస్తూ చోరీలకు పాల్పడేవారని తెలిపారు.
మొత్తం 11 చోరీలు...
ఈ తరహాలో నిందితురాళ్లు సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మొత్తం 11 చోరీలకు పాల్పడ్డారని... ఇందులో వరంగల్ పోలీస్ కమినరేట్ పరిధిలోని హన్మకొండ, మట్వాడా, నర్సంపేటలో రెండు చొప్పున చోరీలకు పాల్పడగా... ఇంతేజాగంజ్, జనగాం, బచ్చన్నపేట్, లింగాల ఘణపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకటి చొప్పున చోరీలకు పాల్పడ్డారని వివరించారు.
ఈ చోరీలపై దృష్టి సారించి సీసీ కెమెరాలతో పాటు అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకుని ఇద్దరు కిలాడీ లేడీలను అరెస్టు చేశామని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి పేర్కొన్నారు.
ఇదీ చూడండి: KATHI MAHESH: నటుడు, సినీ విమర్శకుడు కత్తి మహేశ్ మృతి