TRS Leader Brutal Murder: ఖమ్మం జిల్లా రాజకీయాల్లో దారుణహత్య కలకలం రేపుతోంది. తెరాస నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు తమ్మినేని కృష్ణయ్యను ప్రత్యర్థులు వేటకొడవళ్లతో అత్యంత పాశవికంగా హత్య చేశారు. తెల్దారుపల్లికి చెందిన కృష్ణయ్య పొన్నెకల్లు రైతు వేదికలో జెండా ఆవిష్కరణ చేసి తన అనుచరుడితో కలిసి ఇంటికి వెళ్తున్నారు. తెల్దారుపల్లి గ్రామం సమీపంలోకి రాగానే దోభీ ఘాట్ వద్ద వెనుక నుంచి ఓ ఆటో వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో..కృష్ణయ్య ఆయన అనుచరుడు ముత్తేశం రహదారి పక్కనే ఉన్న కాలువలో పడిపోయారు.
వెంటనే కొంతమంది దుండగులు ఆటోలో నుంచి దిగి వేటకొడవళ్లతో కృష్ణయ్యపై విచక్షణారహితంగా దాడి చేశారు. రెండు చేతులు నరికేశారు. తలపై కత్తులతో నరికారు. దీంతో తీవ్ర రక్త స్రావమై కృష్ణయ్య అక్కడిక్కకడే మృతిచెందాడు. హత్యోదంతం నిమిషాల వ్యవధిలోనే గ్రామస్థులు, ఆయన అనుచరులు, అభిమానులు పెద్దసంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, అభిమానుల రోదనలతో విషాదం అలుముకుంది.
రక్తం మడుగులో ఉన్న కృష్ణయ్య మృతదేహాన్నిచూసి కోపోద్రిక్తులైన కార్యకర్తలు, అభిమానులు గ్రామంలో విధ్వంసం సృష్టించారు. హత్యకు CPM నాయకుడు తమ్మినేని కోటేశ్వరరావు ప్రధాన కారణమని ఆరోపిస్తూ ఆయన ఇంటిపై దాడికి పాల్పడ్డారు. కోటేశ్వరరావు ఇంట్లోకి చొచ్చుకెళ్లి సామగ్రిని ధ్వంసం చేశారు. ఇంటి అద్దాలు పగులగొట్టారు. ఈ క్రమంలోనే పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన కారులను చెదరగొట్టారు.
ఇక్కడి ఆగని నిరసనకారులు పలువురు సీపీఎం కార్యకర్తల ఇళ్లపై దాడులు చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెల్దారుపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిపై కృష్ణయ్య కూతురు రజిత, పలువురు మహిళలు మట్టి పోశారు. గ్రామంలోని సీపీఎం కార్యాలయంపైనా దాడికి పాల్పడ్డారు. అనంతరం తమ్మినేని కోటేశ్వరరావుకు చెందిన గ్రానైట్ క్వారీలో ఉన్న ప్రొక్లెయిన్ ను తగులబెట్టారు. ఈ పరిస్థితుల్లో గ్రామంలో దాదాపు రెండు గంటల పాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మృతుడు కృష్ణయ్య ప్రస్తుతం టేకులపల్లి ఆంధ్రాబ్యాంకు కర్షక సేవా సహకార సంఘం మాజీ ఛైర్మన్, ప్రస్తుతం సంఘం డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. కృష్ణయ్య భార్య మంగతాయి తెల్దారుపల్లి ఎంపీటీసీ సభ్యురాలుగా ఉన్నారు. కృష్ణయ్యకు భార్య మంగతాయి, కుమారుడు నవీన్, కూతురు రజిత ఉన్నారు. రాజకీయ వైరుధ్యాలతోనే ఈ హత్య చేసినట్లు కుటుంబీకులు ఆరోపించారు.
హత్య సంఘటనతో గ్రామంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజకీయ కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు గ్రామస్థులు, పోలీసులు భావిస్తున్నారు. కృష్ణయ్య శరీరంపై మొత్తం 15 కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కృష్ణయ్య కుమారుడు తమ్మినేని నవీన్ ఖమ్మం గ్రామీణం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో తమ్మినేని కోటేశ్వరరావు తండ్రి హత్యకు కుట్రపన్ని పథకం ప్రకారం దారుణంగా హత్య చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నవీన్ ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: కాళ్లు, చేతులు కట్టేసి రూ.30 వేలు అపహరణ