secunderabad agnipath case: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో పరారీలో ఉన్న మరో 11 మంది కోసం రైల్వే పోలీసు బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. హింసకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. విద్యార్థుల వాట్సాప్ వాయిస్ రికార్డులు, మెసేజ్ల ద్వారా ఘటనకు సంబంధమున్న మరికొందరిని అరెస్టు చేసేందుకు రెండు బృందాలుగా రైల్వే పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 45మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు.
సికింద్రాబాద్ ఘటనలో కాల్పులపై పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లర్లపై నిజనిర్ధరణ కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అభ్యర్థులు, పోలీసుల కాల్పుల అంశంలో నివేదిక సిద్ధం చేస్తామని తెలిపారు. కాల్పులు జరపాల్సి వస్తే మోకాళ్ల భాగంలో కాల్చాలని.. రబ్బర్ తూటా, రియల్ తూటా అనే చర్చ జరుగుతోందని వెల్లడించారు. ఈ ఘటనపై అధికారులు పూర్తి సమాచారాన్ని ప్రజల ముందుంచాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఉద్యోగం కోసం వచ్చిన అభ్యర్థులపై కాల్పులు జరపడమేంటని ఆయన ప్రశ్నించారు. మానవహక్కుల కమిషన్‌ను, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని లక్ష్మణ్ స్పష్టం చేశారు. కాల్పుల ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని రైల్వే పోలీసులను మానవహక్కుల సంఘం ప్రతినిధులు కోరారు.
ఇవీ చదవండి: