Road accidents today: రాష్ట్రంలో వేర్వేరు జిల్లాల్లో నాలుగు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందగా.. పలువురికి గాయాలయ్యాయి.
కారు- బైక్ ఢీకొని
నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం వెల్టూర్ గ్రామ శివారు వద్ద... కారు, ద్విచక్రవాహనం ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందారు. శ్రీశైలం నుంచి వస్తున్న కారు... డిండి నుంచి నడింపల్లి వెళ్తున్న ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొట్టాయి. ఈ దుర్ఘటనలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు నడింపల్లి గ్రామస్థులుగా గుర్తించారు. కారు నడిపే వ్యక్తి మద్యం మత్తులో వేగంగా వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వెనుకనుంచి ఢీ కొట్టి
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం ఎయిమ్స్ ఆస్పత్రి వద్ద రెండు వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందారు. హైదరాబాద్ సంతలో విక్రయించడానికి పశువుల లోడుతో హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారిపై బొలెరో వాహనం వెళ్తోంది. హైదరాబాద్ వైపు వెళ్తున్న జేసీబీని, బొలెరో వాహనం వెనుక నుంచి ఢీకొట్టడంతో బొలెరో వాహనం బోల్తా పడింది. ఘటనలో వాహన డ్రైవర్ షేకిల్ మృతి చెందారు. మృతుడు జనగామ వాసిగా పోలీసులు గుర్తించారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం పోలీసులు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.
ఘటనలో బొలెరోలో ఉన్న 7 పశువులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా క్రేన్ సహాయంతో బోల్తా పడ్డ వాహనాన్ని, పశువులను పక్కకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కారు బీభత్సం
నిజామాబాద్‌లోని గౌతమ్‌నగర్ బైపాస్ రోడ్డులో కారు అర్ధరాత్రి బీభత్సం సృష్టించింది. కారు అదుపుతప్పి హోటల్‌లోకి దూసుకెళ్లింది. వాహనంలో ఉన్న ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రాత్రి వేళ హోటల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
రోడ్డు దాటుతుండగా
హైదరాబాద్‌లోని గోల్కొండ పీఎస్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళకు ప్రాణాపాయం తప్పింది. టోలిచౌకిలో రోడ్డు దాటుతున్న యాదమ్మను కారు ఢీ కొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే మహిళను స్థానికులు గోల్కొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. యాదమ్మ స్థానికంగా ఉన్న ఓ స్టోర్‌లో హౌస్ కీపింగ్ చేస్తోంది.
ఇదీ చదవండి: Cyber crime news : లాభాల పేరిట వల.. రెండు నెలల్లో రూ.300 కోట్ల మోసం