విజయవాడకు చెందిన వెంకటేశ్.. నాలుగేళ్ల కోర్సులో ఎన్నో ప్రాజెక్టులు చేసి వాటిని తన ల్యాప్‌టాప్‌లో భద్రంగా దాచుకున్నాడు. ఒకరోజు వాటిని చూద్దామని ప్రయత్నించగా.. ఫోల్డర్లకు తాళం (లాక్) పడినట్లు కనిపించింది. తర్వాత ల్యాప్‌టాప్‌లోని ఫోల్డర్లను ఎన్‌క్రిప్ట్ చేశామని.. డీక్రిప్ట్ చేయాలంటే తమకు 1,060 డాలర్లను (సుమారు రూ.80వేలు) క్రిప్టోకరెన్సీ రూపంలో చెల్లించాలని మెయిల్ వచ్చింది. స్థానిక డేటా రికవరీ నిపుణుల్ని సంప్రదించినా.. వారూ రూ.70 వేల వరకు ఖర్చవుతుందని చెప్పారు. ల్యాప్‌టాప్ కొనడానికే అప్పు చేసిన వెంకటేశ్.. ఆ మొత్తం వెచ్చించలేక, సమాచారం ఎలా తీసుకోవాలో తెలియక తలపట్టుకున్నాడు.
హైదరాబాద్‌లోని ఒక మందుల దుకాణం.. ఆసుపత్రులకు రూ.లక్షల విలువైన మందులు, ఇతర పరికరాలు సరఫరా చేసింది. వాటి బిల్లులన్నీ కంప్యూటర్‌లోనే ఉన్నాయి. తీరా ఒక రోజు అది లాక్ అయిపోయింది. అన్‌లాక్ చేయాలంటే 3,400 డాలర్లను (సుమారు రూ.2.50 లక్షలు) క్రిప్టోకరెన్సీ రూపంలో చెల్లించాలని మెయిల్ వచ్చింది. పెద్దమొత్తంలో బకాయిలకు సంబంధించిన బిల్లులు కావడంతో.. దుకాణ యజమాని వారు అడిగినంత చెల్లించి డీక్రిప్ట్ చేయించుకున్నారు.
![](https://assets.eenadu.net/article_img/ap-main5b_63.jpg)
ఎక్కడ నుంచి... ఎలా వస్తుందో తెలియదు. తెల్లారేసరికి కంప్యూటర్‌లోని సమాచారం లాక్ అయిపోతుంది. అవి కావాలంటే వేలల్లో డాలర్లు చెల్లించాలనే సందేశాలు వస్తాయి. ర్యాన్సమ్‌వేర్ అనే ఈ తరహా దాడులు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల భారీగా పెరిగాయి. విద్యార్థులు, వ్యాపార సంస్థలు.. ఇలా అన్ని వర్గాల వారూ సైబర్ దాడుల బాధితులవుతున్నారు. తమకు తెలియకుండా.. ఇదంతా ఎలా అవుతోందో తెలియక తలలు పట్టుకుంటున్నారు. విలువైన సమాచారాన్ని తిరిగి తీసుకునేందుకు పెద్ద మొత్తంలో చెల్లింపులు చేస్తున్నారు. ఒకే తరహా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించే సూపర్ మార్కెట్లు, దుకాణాల చైన్ లాంటివీ వీరి బారిన పడుతున్నాయి. తాజాగా అమెరికాలో 1,500 వ్యాపారాలపై ర్యాన్సమ్‌వేర్ ప్రభావం పడింది. ఇటీవల అక్కడ ఒక ఇంధన సంస్థ పైప్‌లైన్‌పైనా దాడి చేసి.. తిరిగి పునరుద్ధరించేందుకు 3వేల బిట్‌కాయిన్స్ వసూలు చేశారు.
మన కంప్యూటర్‌లోకి ప్రవేశం ఎలా?
మనకు అనేక ఈ మెయిల్స్ వస్తాయి. మనకు తెలియనివారి నుంచి వచ్చిన మెయిల్‌లోని ఎటాచ్‌మెంట్‌ను క్లిక్‌చేస్తే.. సైబర్‌దాడి జరిగే అవకాశం ఎక్కువ. ఎటాచ్‌మెంట్లు, లింకుల రూపంలో మనకు ఎర వేసి.. క్షణాల్లో ర్యాన్సమ్‌వేర్‌ను మన సిస్టమ్‌లోకి చొప్పిస్తారు. కొన్నిసార్లు ఒకే తరహా వ్యాపారాలకు సాఫ్ట్‌వేర్ రూపొందించేటప్పుడు అందులో కొన్ని బగ్స్ ఉంటాయి. వాటి ఆధారంగా కూడా కొందరు సైబర్ దాడులకు దిగుతున్నారు. వీరు ఎక్కడుంటారో గుర్తించడం దాదాపు అసాధ్యం. బ్యాంకు ఖాతా వివరాలేవీ ఇవ్వకుండా.. బిట్‌కాయిన్స్ ద్వారానే చెల్లించమంటారు.
గత నెలలో బయటపడిన ర్యాన్సమ్‌వేర్‌లు..
* లోరెంజ్
* హంబల్
* సోలార్ మార్కర్
* ఆర్‌ఏటీ-ఆర్‌ఈజేజీ
* ఎల్4-ఎన్‌సీ34
వీటిని క్లిక్ చేస్తే.. మాల్‌వేర్‌కు ఆహ్వానం పలికినట్లే..
- అమెజాన్/ఫ్లిప్‌కార్ట్ వార్షికోత్సవాలని.. తక్కువ ధరకే వస్తువులని సందేశాలు వస్తాయి. వాటి ఎటాచ్‌మెంట్లను క్లిక్ చేస్తే మాల్‌వేర్‌ను ఆహ్వానించినట్లే. స్పెల్లింగులో తప్పులుంటే ముట్టుకోకూడదు.
- సిబిల్ రిపోర్టు, ఆదాయపుపన్ను సమాచారం.. అంటూ వేర్వేరు సందేశాలు వస్తాయి. పెద్దమొత్తంలో లాటరీ తగిలిందనీ చెబుతారు. ఆ లింకులు క్లిక్‌చేస్తే క్షణాల్లో అన్నీ లాక్ చేస్తారు.
- సామాజిక మాధ్యమాల్లోనూ ప్రోత్సాహక బహుమతులంటూ సందేశాలు వస్తాయి. వాటిని క్లిక్ చేసినా.. మన సిస్టమ్‌లోని సమాచారం దోచేస్తారు.
ముందు జాగ్రత్తలు...
![](https://assets.eenadu.net/article_img/ap-main5c_28.jpg)
ఇంటర్నెట్ ఆపేయడం:
కంప్యూటర్/ల్యాప్‌టాప్ వాడటం పూర్తయ్యాక దాని ఇంటర్‌నెట్ కనెక్షన్ తీసేయాలి. అవసరమైనప్పుడు మళ్లీ కనెక్ట్ చేసుకోవాలి.
![](https://assets.eenadu.net/article_img/ap-main5d_16.jpg)
లైసెన్స్‌డ్ యాంటీవైరస్:
మన సిస్టమ్‌లో లైసెన్స్ కలిగిన యాంటీవైరస్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అది మాల్‌వేర్/ట్రోజన్స్/ర్యాన్సమ్‌వేర్‌లను గుర్తించి, వాటిని తొలగిస్తుంది.
![](https://assets.eenadu.net/article_img/ap-main5e_8.jpg)
ఆపరేటింగ్ సిస్టమ్:
మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు ఇచ్చే లైసెన్స్ కలిగిన ఆపరేటింగ్ సిస్టమ్‌నే వినియోగించాలి. దాన్నీ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తే చాలావరకూ కంప్యూటర్ సురక్షితంగా ఉంటుంది. వెబ్ బ్రౌజర్ల విషయంలోనూ ఆటో అప్‌డేట్ పెట్టుకోవాలి.
![](https://assets.eenadu.net/article_img/ap-main5f_8.jpg)
టూ స్టెప్ ఆథెంటికేషన్:
ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఖాతాలు, ఈమెయిల్స్, సామాజిక మాధ్యమ ఖాతాలను యాక్సెస్ చేయాలంటే టూ స్టెప్ ఆథెంటికేషన్ పెట్టుకోవాలి. పాస్‌వర్డ్‌తోపాటు ఓటీపీ, వేలిముద్ర, వాయిస్ రికగ్నిషన్ తదితర విధానాలు పాటించాలి.
![](https://assets.eenadu.net/article_img/ap-main5g_6.jpg)
డేటా బ్యాకప్:
మన సిస్టమ్‌లోని విలువైన సమాచారాన్ని కనీసం నెలకోసారి బ్యాకప్ చేసుకుని భద్రపరచుకోవాలి. ఎక్స్‌టర్నల్ హార్డ్‌డిస్కులలో దీన్ని సేవ్ చేసుకోవచ్చు.
![](https://assets.eenadu.net/article_img/ap-main5h_1.jpg)
పాస్‌వర్డ్‌లు ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లలో పెట్టుకోవద్దు:
బ్యాంకు ఖాతాల యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను కంప్యూటర్లు, సెల్‌ఫోన్లలో పెడుతుంటారు. మన కంప్యూటర్ యాక్సెస్ అయితే.. ఇవన్నీ సైబర్ దొంగల పాలవుతాయి.
102% పెరిగిన దాడులు
ర్యాన్సమ్‌వేర్ దాడులు గతేడాదితో పోలిస్తే 102% పెరిగాయి. నమ్మదగిన వెబ్‌సైట్ల నుంచే సమాచారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. www.infosecawareness.in అనే వెబ్‌సైట్‌లో సైబర్ భద్రత గురించి తెలుసుకోవచ్చు. 18004256235 టోల్‌ఫ్రీ నంబరు ద్వారా సంప్రదించవచ్చు. - ఎం.జగదీశ్‌బాబు, ప్రాజెక్టు మేనేజర్, ఐఎస్‌ఈఏ, సీ-డాక్, హైదరాబాద్
ఎక్కువగా వెతికే అంశాల ద్వారా
మనం ఇంటర్‌నెట్‌లో ఎక్కువగా వెతికే అంశాల ద్వారానే సైబర్ దొంగలు మాల్‌వేర్‌ను ప్రవేశపెడతారు. కొత్త సినిమాలు, ఉచిత సాఫ్ట్‌వేర్‌లు, ఆటల లింకులలో మాల్‌వేర్ ఉంటుంది. వాటిని క్లిక్ చేసి, రోజూ వందలమంది బాధితులవుతున్నారు. - ఆర్.శ్రీనివాస్, డేటా రికవరీ నిపుణుడు, హైదరాబాద్
ఇదీ చదవండీ.. Supply Chain Attack : సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేస్తున్నారా.. ఐతే జాగ్రత్త!