Vanasthalipuram Theft Case : హైదరాబాద్ వనస్థలిపురం పరిధిలోని పలు ఇళ్లల్లో మూణ్నెళ్ల క్రితం దొంగతనం జరిగిన కేసులో ఇద్దరు దొంగలను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు నిర్వహించామని.. తమిళనాడు, బంగాల్‌లో వారిపై కేసులు ఉన్నట్లు తేలిందని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ఇద్దరు నిందితులపై 14 కేసులు ఉన్నాయని వెల్లడించారు. వారిద్దరిపై పీడీ చట్టం కింద కేసు నమోదు చేస్తామన్నారు.
సైకిల్‌పై తిరుగుతూ రెక్కీ..
Accused Arrest in Vanasthalipuram Theft : నిందితులు ఇద్దరు.. పగలు సైకిల్‌పై తిరుగుతూ.. తాళం వేసిన ఇళ్లను గుర్తిస్తారని.. రాత్రి వేళ దొంగతనాలకు పాల్పడతారని భగవత్ చెప్పారు. బంగాల్ పోలీసుల సాయంతో దొంగల నుంచి సొత్తు రికవరీ చేశామని తెలిపారు.
Vanasthalipuram Theft Case Updates : 'మూడు నెలల క్రితం వనస్థలిపురం పీఎస్ పరిధిలోని ఇళ్లల్లో చోరీ జరిగింది. వేలి ముద్రలు సేకరించి రాష్ట్రంలోని డేటాబేస్‌తో పోల్చి చూస్తే సరిపోలలేదు. జాతీయ డేటాబేస్తోనూ సరిపోలకపోవడం వల్ల ఈ కేసు సవాల్‌గా మారింది. క్షుణ్నంగా దర్యాప్తు చేస్తే.. ఈ దొంగతనం చేసిన వారిపై తమిళనాడు, పశ్చిమబంగాల్లో పెటీ కేసులున్నట్లు తేలింది. ప్రత్యేక బృందాలతో వారికోసం వేట షురూ చేశాం. హయత్‌నగర్ మండలంలోని సాహెబ్‌నగర్‌లో నిందితులు ఓ గది అద్దెకు తీసుకుని ఉంటున్నట్లు గుర్తించాం. వీళ్లిద్దరు బంగాల్‌కు చెందినవారే.
బంగారం విక్రయించేది అక్కడే
దొంగతనం చేసిన తర్వాత రైల్లో వెళ్లి పశ్చిమ బెంగాల్లో బంగారం విక్రయిస్తున్నారు. ఆ రాష్ట్ర పోలీసుల సాయంతో బంగారం రికవరీ చేశాం. వీరిపై 14 కేసులున్నాయి. 11 రాచకొండ, 2 సూర్యాపేట, ఒక దొంగతనం రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో జరిగింది. కేవలం తెలంగాణలోనే కాకుండా కేరళ, తమిళనాడులోనూ వీళ్లు చోరీలకు పాల్పడ్డారు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. వీళ్లని తొలిసారిగా పట్టుకుంది రాచకొండ పోలీసులే.
- మహేశ్‌భగవత్, రాచకొండ సీపీ