సర్వం అంతర్జాలమయమైన ప్రస్తుత రోజుల్లో ఇదేమీ ఆశ్చర్యకరమైన విషయం కాదు. అంతెందుకు మీ పుట్టిన తేదీ మొదలు వ్యక్తిగత వివరాలు, ఆహారపు అలవాట్లు, ఇష్టమైన దుస్తుల వంటి సమస్త సమాచారం ఎప్పుడో అంతర్జాలానికి అర్పితమైంది. ‘ఓపెన్ సోర్స్ ఎనలటిక్స్’ పేరుతో పెద్ద పెద్ద సంస్థలు తమ వ్యాపార అవసరాల కోసం ఈ తరహా విశ్లేషణ నిర్వహించి దగ్గర పెట్టుకుంటుండగా ఇప్పుడు ఆ స్థాయి దాటిపోయి నిత్యం జనం వాడుతున్న అనేక యాప్‌లు, వెబ్‌సైట్ల నుంచే సమాచారం చోరీ అవుతోంది. వాటిలో పనిచేసే ఐటీ నిర్వాహకులు తలచుకుంటే వ్యక్తిగత వివరాలు తెలుసుకోవడం అసాధ్యమేమీ కాదు.
మనదన్నది ఏదీ మనది కాదన్నట్లే
ఈ అంతర్జాల యుగంలో మనదన్నది ఏదీ మనది కాదన్నట్లే. బ్యాంకు సర్వర్ హ్యాక్ చేస్తే ఖాతా వివరాలు తెలిసిపోతాయి. వాటి ద్వారానే సైబర్ నేరగాళ్లు దోపిడీకి పాల్పడుతున్నారు. వైద్య పరీక్షల కోసం లేబొరేటరీలకు వెళ్తే వివరాలన్నీ అక్కడా నమోదవుతాయి. ఉద్యోగాలు కల్పించే వెబ్‌సైట్లలోనూ సమాచారం ఉంటుంది. ఇలా నమోదైతే నష్టం లేదు. బయటకి వెళ్తేనే ప్రమాదం. ఇలా జరగదని ఎవరూ గ్యారంటీ ఇవ్వడంలేదు. మనం నిత్యం అంతర్జాలం ద్వారా నిర్వహించే రకరకాల కార్యకలాపాల ఆధారంగా మన ఇష్టాయిష్టాలు, అవసరాలను ఎప్పటికప్పుడు విశ్లేషించి వాటిని అనేక సంస్థలు తమ వాణిజ్య అవసరాలకు వాడుకుంటుంటాయి. ఉదాహరణకు ఎవరైనా మార్కెట్లో మంచి సబ్బుల గురించి అంతర్జాలంలో వెతికారనుకుందాం. కొద్దిసేపటి తర్వాత వారు ఏ వెబ్‌సైట్ తెరచినా అందులో వాటి గురించిన ప్రకటనలే వస్తాయి. దీన్నే ‘ఓపెన్ సోర్స్ ఎనలిటిక్స్’ అంటారు. అంతర్జాలం వాడే వారందరికీ ఇది అనుభవమే. రకరకాల యాప్‌లలో నిక్షిప్తమయ్యే వ్యక్తిగత సమాచారాన్ని స్వార్థం కోసం వాడుకోవడం చిక్కులు తెచ్చిపెడుతోంది.
పొంచి ఉన్న ప్రమాదం
- ఆహారం, కూరగాయలు, కిరాణా సరకుల వంటివి సరఫరా చేసే యాప్‌లలో మన ఇంటికి ఎలా రావాలో మ్యాప్‌ల ద్వారా తెలుసుకునే సదుపాయం ఉంటుంది. ఆయా సంస్థల సర్వర్లలోకి ఎవరైనా సైబర్ నేరగాళ్లు చొరబడ్డా, అదే సంస్థలో ఐటీ విభాగంలో పనిచేసే ఎవరికైనా దుర్బుద్ధి పుట్టినా ప్రమాదమే.
- రకరకాల ఈ కామర్స్ యాప్‌లు, వెబ్‌సైట్లలో బ్యాంకు ఖాతాల వివరాలుంటాయి. అవి నేరగాళ్లకు చిక్కినా, ఆయా సంస్థల్లో పనిచేసేవారికి చెడు ఆలోచన వచ్చినా మన సమాచారం గల్లంతయినట్లే. ఆనక మన ఖాతాల్లో డబ్బుకు రెక్కలొచ్చినట్లే.
- ఇప్పుడు ప్రతి ఆసుపత్రి, లేబొరేటరీల్లో వివరాలన్నీ కంప్యూటర్లలోనే నమోదవుతున్నాయి. రోగులకు చెందిన సమస్త వివరాలూ నివేదికలు సహా నిక్షిప్తమవుతాయి. ఇవి అపరిచితుల చేతికి చిక్కితే చిక్కులు తప్పవు.
ఇవే ఉదాహరణలు
- ఇటీవల ఓ యువతి ఈ-మెయిల్‌కు ఆమె చిత్రాన్నే అసభ్యంగా మార్ఫింగ్ చేసి పంపారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే అంతర్జాలంలో పెడతామని బెదిరించారు. పెళ్లి సంబంధాలు చూసే వెబ్‌సైట్‌లో పెట్టిన ఫొటోను దొంగిలించి ఇలా చేశారని పోలీసుల విచారణలో తేలింది.
- సికింద్రాబాద్‌కు చెందిన ఓ యువకుడికి ఉద్యోగం ఇస్తున్నట్లు ఓ ప్రముఖ కంపెనీ నుంచి లేఖ అందింది. రూ.10వేలు డిపాజిట్ చేయాలని అందులో పేర్కొన్నారు. నమ్మిన యువకుడు చెప్పిన ఖాతాలో డబ్బు వేశారు. ఉద్యోగంలో చేరేందుకు ఆ సంస్థ కార్యాలయానికి వెళ్లాక ఆ లేఖ నకిలీదని తెలిసింది. ఉద్యోగాలు చూపించే సంస్థ వెబ్‌సైట్ నుంచి సమాచారం తస్కరించిన నిందితులు ఇలా అనేక మందిని మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది.
సంస్థలదే బాధ్యత
రకరకాల సేవల పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించే సంస్థలే ఇది బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆయా సంస్థల్లో పనిచేసే సిబ్బందికి కూడా ఇది అందుబాటులో ఉండకుండా చూడాలి. ఒకవేళ ఎవరైనా ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని చూస్తే ఆ విషయం ఉన్నతాధికారులకు తెలిసే ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ సమాచారం సైబర్ నేరగాళ్లకు చేరకుండా తగిన భద్రత కల్పించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఇవీ చూడండి: రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఎన్‌జీటీకి కేంద్రం నివేదిక