Kamareddy Accident Update: ఆదివారం సాయంత్రం కామారెడ్డి జిల్లా అసన్‌పల్లి గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి పోస్టుమార్టం పూర్తయింది. బాన్సువాడ ఏరియా ఆస్పత్రి ఆవరణలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పోలీసులు.. వారి వారి బంధువులకు మృతదేహాలను అప్పగించారు. దుర్ఘటనతో ఆస్పత్రి వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు మృతదేహాలను అప్పగించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఎస్పీ శ్రీనివాస రెడ్డి.. ప్రయాణాలు చేసేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రైవేటు వాహనాల కంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు శ్రేయస్కరమైనవని పేర్కొన్నారు.
9 మందిని కబళించిన మృత్యువు: ఆదివారం రోజు పిట్లం మండలం చిల్లర్గి నుంచి టాటా ఏస్‌లో 25 మంది ఎల్లారెడ్డి వెళ్లారు. అక్కడ సమీప బంధువు దశదిన కర్మ అనంతరం అంగడిదింపుడుకు వెళ్లి.... తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. అనంతరం తిరుగు ప్రయాణంలో డ్రైవర్ వాహనం వేగంగా నడపటంతో... ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఆటోను ఢీకొన్న తర్వాత లారీ పక్కన ఉన్న రేకుల షెడ్డులోకి దూసుకెళ్లింది. ఘటనాస్థలంలో డ్రైవర్ సాయిలు, లచ్చవ్వ అక్కడిక్కడే చనిపోయారు. క్షతగాత్రులను ఎల్లారెడ్డి, బాన్సువాడ, నిజామాబాద్ ఆస్పత్రులకు తరలించారు. చికిత్స పొందుతూ అంజవ్వ, వీరమణి, సాయవ్వ, వీరవ్వ, గంగామణి మరణించారు. బాన్సువాడ ఆస్పత్రి నుంచి నిజామాబాద్‌కు తరలిస్తుండగా ఎల్లయ్య, పోచయ్య మార్గమధ్యలో ప్రాణాలు విడిచారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. వాహనాన్ని తప్పించేందుకు లారీ డ్రైవర్ రోడ్డు కిందకు తప్పించినా లాభం లేకపోయింది. ప్రమాదసమయంలో డ్రైవర్ మద్యంమత్తులో ఉన్నట్లు.... గాయపడినవారు చెబుతున్నారు. డ్రైవింగ్ చేయొద్దని చెప్పినా వినకుండా....మత్తులో డ్రైవింగ్ చేశారని పేర్కొంటున్నారు.
ప్రధాని సంతాపం: కామారెడ్డి జిల్లా ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని.. బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేలు పరిహారం ప్రకటించారు. దుర్ఘటనపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సాయం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం, క్షతగాత్రులకు రూ.50 వేలు ప్రకటించారు.
ఇవీ చదవండి: Road Accident In Kamareddy: తొమ్మిది మంది ప్రాణాలను బలిగొన్న అతివేగం..