Tony Drugs Case interrogation in Telangana: ముంబయి కేంద్రంగా మాదకద్రవ్యాల నెట్‌వర్క్ నిర్వహిస్తున్న నైజీరియన్ టోనీని విచారిస్తున్న కొద్దీ మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాదకద్రవ్యాల అక్రమ రవాణాతో టోనీ కోట్లు గడించినట్లు దర్యాప్తులో తేల్చారు. అతని వాట్సాప్ చాటింగ్ ద్వారా చాలామందితో సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. కానీ వాట్సాప్ సంభాషణలన్నీ కూడా డిలీట్ చేయడంతో వాటిని రిట్రైవ్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.
పోలీసుల ప్రశ్నలకు టోనీ ముక్తసరిగా సమాధానం ఇస్తున్నట్లు తెలుస్తోంది. తాను మాదక ద్రవ్యాల సరఫరా చేసిన మాట వాస్తవమేనని... ఇంకోసారి అలాంటి పనులు చేయనని, మారిపోవడానికి అవకాశం ఇవ్వాలని పోలీసులను అభ్యర్థిస్తున్నట్లు తెలిసింది. మాదక ద్రవ్యాల సరఫరాలో ఏజెంట్లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్‌లో 13మంది వ్యాపారులే కాకుండా టోనీ వినియోగదారులెవరెవరూ ఉన్నారనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. రేపటితో టోనీ కస్టడీ ముగియనుంది. ఈ లోపు అతని నుంచి పూర్తి సమాచారం సేకరించేందుకు పంజాగుట్ట పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఇదీ చూడండి: బ్యాగ్.. ఐడీ కార్డ్ ఓకే.. శానిటైజర్, మాస్కు ఉన్నాయా మరి!