నల్లొండ జిల్లా నాగర్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో ఇటీవల కాలంలో అపహరణకు గురైన విద్యుత్ మోటార్ల కేసును పోలీసులు ఛేదించారు. నియోజకవర్గ పరిధిలో ఇటీవల కాలంలో సాగర్ కాలువ వెంబడి రైతులు పొలాలకు అమర్చిన మోటార్లను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలిస్తున్నారంటూ రైతులు నియోజకవర్గంలోని పలు పోలీసు స్టేషన్‌లలో ఫిర్యాదులు చేశారు. దీనిపై నిఘా పెట్టిన త్రిపురారం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. త్రిపురారంలో ఇద్దరు వ్యక్తులు ఆటోలో తరలిస్తున్న మోటార్లతో పట్టుపడ్డారు. వారు నిడమనూరు మండలం జంగలావారి గూడెంనకు చెందిన సిరాసల రమేశ్, కడమంచి శేఖర్‌గా గుర్తించారు. వారిని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వరరావు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ఈ ఇద్దరు యువకులు సాగర్ ఎడమ కాలువ వెంబడి రైతులు పొలాల్లో అమర్చిన విద్యుత్ మోటార్లను సుమారు 45 దొంగిలించి వాటిని పాత ఇనుప సామాన్ల షాపునకు తరలిస్తుండగా వారిని పట్టుకున్నట్లు వారు వివరించారు. అవి అమ్మగా వచ్చిన డబ్బుతో మళ్లీ రైతులకు అప్పుగా ఇస్తారని చెప్పారు. నిందుతుల నుంచి రూ.8 వేల నగదు, ఆటో, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా కేసును ఛేదించిన పోలీసులను డీఎస్పీ అభినందించారు.
ఇవీ చదవండి: