రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కార్లను దొంగలించిన ముఠా సభ్యులను పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఒకటో పట్టణ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
ఈ నెల 19న దుర్గానగర్‌కు చెందిన కోడూరు రవి కారును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. 20వ తేదీన గోదావరిఖని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన ఇంటి ముందు పార్కింగ్ చేసిన కారు తెల్లవారేసరికి కనిపించకుండా పోయిందని రవి పేర్కొన్నారు. పోలీసు బృందాలు బసంత్ నగర్, రేణిగుంట టోల్ ప్లాజా వద్ద సీసీ ఫుటేజీలో కారును గుర్తించారు. కారు నంబరు మాత్రం వేరేదిగా కనిపించగా.. నంబరు ప్లేటు మార్చినట్లు పోలీసులు గుర్తించారు. స్థానికంగా ఉన్న నంబర్ ప్లేట్ తయారు చేసే వారిని విచారించగా, ముగ్గురు వ్యక్తులు ఫేక్ నంబర్ ప్లేట్ తయారుచేయించినట్లు తెలిసిందని డీసీపీ రవీందర్ యాదవ్ తెలిపారు.
సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు హైదరాబాద్, సైదాబాద్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ గఫూర్, మహ్మద్ ఓవైసీద్దీన్, మహ్మద్ సమీర్, మహ్మద్ మోసిన్, షేక్ అబ్దుల్ జబ్బర్‌గా గుర్తించారు. కారును అమ్మడానికి ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ తెలిపారు. దొంగలించిన కారుతోపాటు వారు వినియోగించిన కారు, చరవాణి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులను పట్టుకున్న కానిస్టేబుల్ వెంకటేశ్, శేఖర్‌కు నగదు పురస్కారాలు అందజేశారు.
ఇదీ చూడండి: కరోనాతో ఇద్దరు పాత్రికేయులు మృతి