పేదల అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్న ఎన్జీవో నిర్వాహకులపై పీడీ చట్టం ప్రయోగించారు. నగర సీపీ అంజనీకుమార్ ఆదేశాల మేరకు చాంద్రాయణగుట్ట పోలీసులు శుక్రవారం హైదరాబాద్ యూత్ కరేజ్(హెచ్‌వైసీ) అధ్యక్షుడు మహ్మద్ సల్మాన్‌ఖాన్(29), ఉపాధ్యక్షుడు సయ్యద్ అయూబ్(31)ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఆసిఫ్‌నగర్‌లోని హుమయూన్‌నగర్‌కు చెందిన సల్మాన్‌ఖాన్, బోరబండకు చెందిన సయ్యద్ అయూబ్ 2020లో హెచ్‌వైసీ పేరిట ఎన్జీవో ఏర్పాటు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలు, దిల్లీ అల్లర్ల బాధితులు తదితరులతో దయనీయ వీడియోలు రూపొందించి, వాట్సాప్, ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. దాతలు రూ.లక్షలను ఆన్‌లైన్ ద్వారా బదిలీ చేశారు. బాధితులకు కొంత ముట్టజెప్పి మిగతాది దారి మళ్లించారు.
చాంద్రాయణగుట్ట నర్కిపూల్‌బాగ్‌లో మెదడు వ్యాధితో బాధపడుతున్న యాస్మీన్ సుల్తానా(50)ను ఆదుకోవాలంటూ ఓ పోస్టు పెట్టగా రూ.45 లక్షలు వచ్చాయి. రూ.30 లక్షలు తీసుకొని, రూ.15 లక్షలు బాధితురాలి కుటుంబానికి ఇచ్చారు. ఇది తెలిసిన దాతలు ఫిర్యాదు చేయడంతో వీరి అక్రమాలు వెలుగు చూశాయి. ఇలాంటివే పలు కేసులు నమోదవడంతో పోలీసులు పీడీ చట్టం ప్రయోగించారు.
ఇదీ చూడండి: 'కరోనాతో కొత్తగా పేదరికంలోకి వెళ్లిన 13.1 కోట్ల మంది'