మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం నిదానపురం సర్పంచ్ మానవత్వం చాటుకున్నారు. కరోనాతో మృతి చెందిన వృద్ధురాలి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. నిదానపురం గ్రామానికి చెందిన లచ్చమ్మ(65) అనే వృద్ధురాలు ఇటీవల కరోనాకు గురైంది. ఆమె పెద్ద కుమారుడు కూడా కొవిడ్ బారిన పడ్డాడు. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురైన లచ్చమ్మ మృతి చెందింది. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కొవిడ్ భయంతో ఎవరూ ముందుకు రాలేదు.
గ్రామ సర్పంచ్ పెండ్యాల నరేశ్, ఆయన సోదరుడు, మృతురాలి కుమారుడు ముగ్గురు కలిసి.. పీపీఈ కిట్లు ధరించి మృతదేహాన్ని గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌లో పెట్టి గ్రామశివారులోని చెరువు వద్దకు తరలించారు. అనంతరం మృతదేహాన్ని గుంతలో పెట్టి జేసీబీతో పూడ్చివేసి ఖననం చేశారు. సర్పంచ్ చూపిన మానవత్వానికి హర్షిస్తూ గ్రామస్థులు ఆయన్ను అభినందించారు.
- ఇదీ చూడండి: 'కరోనా రెండోదశకు స్వీయ తప్పిదాలే కారణం'