వ్యాపార రుణాలు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న సమీర్ మీర్జా ఇప్పటివరకు దాదాపు రూ.4.5 కోట్లు వసూలు చేసినట్టు గచ్చిబౌలి సీఐ సురేశ్ తెలిపారు. బంజారాహిల్స్‌లో నివాసం ఉండే మీర్జా ఖాదర్ అలియాస్ సమీర్ మీర్జా మిస్టర్ బిల్డర్ రియల్ ఎస్టేట్ అండ్ కన్‌స్ట్రక్షన్ పేరుతో గచ్చిబౌలిలోని ఓ కార్యాలయాన్ని అద్దెకు తీసుకున్నారని వెల్లడించారు. 30మంది సిబ్బందిని నియమించుకొని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా చలామణి అవుతున్నాడని పేర్కొన్నారు. రుణాలు ఇప్పిస్తామంటూ ఆన్‌లైన్‌లో ప్రకటనలు చేస్తూ... నమ్మిన వారికి తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు ఇప్పిస్తానంటూ ప్రాసెసింగ్ రుసుం పేరిట డబ్బు వసూలు చేస్తాడని వివరించారు.
ప్రాసెసింగ్ ఫీజు పేరిట మోసం
ఒక ప్రైవేటు కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న మోహన్ రావు గత డిసెంబర్‌లో మీర్జా ఖాదర్‌ని కలిసి వ్యాపార విస్తరణకు రూ.300 కోట్ల రుణం కావాలని కోరినట్లు తెలిపారు. ఆ మొత్తాన్ని రుణంగా ఇప్పిస్తానని నమ్మించి అతడి నుంచి రూ.2.18 కోట్లు వసూలు చేశాడని వెల్లడించారు.
గతంలోనూ మోసాలు
మోహనరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా సమీర్ మీర్జా చేసిన మోసాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయని అన్నారు. ఇప్పటి వరకు దాదాపు ఆరుగురు బాధితుల నుంచి ఫిర్యాదులు అందాయని సీఐ తెలిపారు. నిందితుడు సమీర్ మీర్జా గతంలోనూ పలు రకాల మోసాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. వాటికి సంబంధించిన కేసు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లలో ఉన్నాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే బిడ్డ మృతి..!