జల్సాలకు అలవాటుపడి ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతోన్న పాత నేరస్థుడిని కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 9 బైకులను స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు కేసు వివరాలను వెల్లడించారు.
ఏపీలోని కడప జిల్లా వేంపల్లికి చెందిన బడి వంశీరెడ్డి బాచుపల్లి ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. జల్సాలకు అలవాటుపడ్డాడు. ఈజీగా డబ్బు సంపాదించేందుకు దొంగతనాలను ఎంచుకున్నాడు. బైకులను చోరీ చేయడం మొదలెట్టాడు. ఇలా 2017లో ఎస్.ఆర్.నగర్ పోలీస్స్టేషన్, బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ల పరిధిలో 7 ద్విచక్రవాహనాల దొంగతనం కేసులో అరెస్టై, జైలుకెళ్లాడు.
తిరిగి బయటకొచ్చి కూకట్‌పల్లి, కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ల పరిధిలో 9 బైకులను దొంగిలించాడు. కూకట్‌పల్లి వై జంక్షన్లో ఓ స్కూటీని దొంగిలించి వెళుతుండగా.. పోలీసులకు చిక్కాడు. అదుపులోకి తీసుకొని విచారించి.. అతని నుంచి 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ తెలిపారు.
ఈ సందర్భంగా వాహనాలను పార్క్ చేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీసీపీ సూచించారు. నిర్దేశించిన స్థలాల్లోనే వాహనాలను నిలిపి.. కాపాడుకోవాలన్నారు.
ఇదీ చూడండి: ప్రేయసి వేరే వ్యక్తిని ప్రేమించిందని.. ఆడియో రికార్డ్ చేసి..!