మహారాష్ట్ర ముంబయిలోని బాంద్రాలో అపహరణకు గురైన బాలుడి కథ కరీంనగర్ పోలీసుల చొరవతో సుఖాంతమైంది. కరీంనగర్ పోలీసుల సాయంతో.. చిన్నారిని ముంబయి పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. బాలుడు జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామంలో ఉన్నట్టు గుర్తించి.. చిన్నారిని సురక్షితంగా ముంబయి పోలీసులకు అప్పగించారు.
3 లక్షల 15 వేలకు బేరం...
బుగ్గారం గ్రామానికి చెందిన 50 ఏళ్ల వయసు దాటిన దంపతులకు పిల్లలు లేరు. వాళ్లకు నక్క రాజు అనే డిష్ మెకానిక్ పరియచమయ్యాడు. తమకు ఓ బాబు కావాలని అడగ్గా... ముంబయిలో తనకు తెలిసిన వారికి సమాచారం చేరవేశాడు. ముంబయికి చెందిన ఓ మధ్యవర్తి.. స్థానికంగా ఉంటున్న యచక దంపతుల నుంచి 9 నెలల బాలున్ని ఆగస్టు 29న అపహించాడు. చిన్నారిని మూడు లక్షల 15 వేలకు కొనుగోలు చేసినట్టు తెలిపాడు. సొమ్ము చెల్లించేందుకు సుముఖత చూపించిన దంపతులు.. కారులో డబ్బు తీసుకుని 31న ముంబయికి బయలుదేరారు. డబ్బు ముట్టజెప్పి బాలునితో తిరుగుపయనమయ్యారు.
ఎలా ఛేదించారంటే..
మరోవైపు.. తమ కుమారున్ని ఎవరు ఎత్తుకెళ్లారో తెలియక ఆ యాచక దంపతులు అన్ని చోట్ల వెతికారు. ఫలితం లేకపోవటంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో 30న ఫిర్యాదు చేశారు. సాంకేతికత, సీసీ కెమెరాల సాయంతో కారును, చరవాణి నెంబర్‌ను గుర్తించారు. వాటి సాయంతో వాళ్ల చిరునామా తెలుసుకున్నారు. వెంటనే కరీంనగర్ సీపీ సత్యనారాయణకు విషయాన్ని వివరించారు. వెంటనే స్పందించిన సీపీ.. ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకుని ఛేదించాలని ఆదేశించారు. రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు టెక్నాలజీ సాయంతో బాలుడి చిరునామా తెలుసుకున్నారు. ముంబయి నుంచి బాలున్ని తీసుకొచ్చిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీసుల సమాచారంతో ముంబయి పోలీసులు.. బుధవారం రోజు కరీంనగర్‌కు చేరుకున్నారు. కరీంనగర్ సీపీ సత్యనారాయణను కలిసి విషయం వివరించారు.
అభినందనలు..
స్థానిక పోలీసుల సహాయంతో గురువారం రోజు గోపులాపూర్‌కు చేరుకుని.. బాలుడిని కొనుగోలు చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. మధ్యవర్తితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమ దృష్టికి వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే కేసును ఛేదించిన స్థానిక పోలీసులను డీజీపీ మహేందర్ రెడ్డి అభినందించారు.
ఇదీ చూడండి: