2017-2019 మధ్య మూడేళ్లలో ఏపీ వ్యాప్తంగా 2,859 హత్యకేసులు నమోదయ్యాయి. వీటిలో 1,660 (58.60 శాతం) ఘటనలకు వివాదాలు, వివాహేతర సంబంధాలే కారణాలు. బాధితులుగా మారుతున్న వారిలో ఎక్కువ మంది 18-30 ఏళ్ల వారే.
దగ్గరివారే..
2017-19 మధ్య వివాదాల వల్ల 1,139 మంది హత్యలకు గురయ్యారు. కుటుంబ తగాదాలు, భూ వివాదాలు, నగదు లావాదేవీల్లో తలెత్తిన విభేదాలు, చిన్నచిన్న గొడవల్లో ప్రత్యర్థులు వారిని హతమార్చారు. వీరిలో 492 మంది (43.19 శాతం) కుటుంబ వివాదాల వల్లే హత్యలకు గురయ్యారు
పలు ఘటనల్లో హతులు, హంతకులు ఒక కుటుంబానికి చెందినవారే. ఆస్తి తగాదాల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా సోదరుల మధ్య ఇలాంటి విభేదాలు అధికమని విశ్లేషిస్తున్నారు.
అడ్డుగా ఉంటున్నారని..
- వివాహేతర సంబంధాల వల్ల మూడేళ్లలో 521 మందిని చంపేశారు. ఏటా ఈ ఒక్క కారణంతో సగటున 17-18 శాతం హత్యలు జరుగుతున్నాయి.
వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో కొందరు, తమ వైవాహిక జీవితంలోకి ప్రవేశించి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారనే కారణంతో మరికొందరు ఈ హత్యలకు పాల్పడుతున్నారు. వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారనే అనుమానంతోనూ ఇంకొంతమందిని చంపేస్తున్నారు. ఈ హత్యల్లో అంతమవుతున్న వారిలో ఎక్కువమంది 18-30 ఏళ్లకు చెందినవారే ఉంటున్నారు.